HMPV Cases In India: న్యూఢిల్లీ: గత డిసెంబర్ లో చైనాలో కలకలం రేపిన హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు ప్రస్తుతం భారత్‌ను కలవరపెడుతోంది. ఇదివరకే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా పుదుచ్చేరిలో మరోకరిలో వైరస్ గుర్తించారు. పుదుచ్చేరిలో ఒక చిన్నారికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో HMPV పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరింది. 

Continues below advertisement


కోలుకుంటున్న మరో చిన్నారి


పుదుచ్చేరిలో ఓ బాలిక కొన్ని రోజుల కిందట జ్వరం, దగ్గు, జలుబు సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. పుదుచ్చేరిలో నమోదైన రెండో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసు ఇది. జనవరి మొదటి వారంలో మూడేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఆ చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. చిన్నారి వైద్య చికిత్సలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పుదుచ్చేరి హెల్త్ డైరెక్టర్ వి రవిచంద్రన్ తెలిపారు.


పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసుతో కలిపితే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. గరిష్టంగా గుజరాత్‌లో 5 కేసులు, మహారాష్ట్ర, కోల్‌కతాలో మూడు చొప్పున, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు చొప్పున, అస్సాంలో ఒక హెచ్ఎంపీవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోనూ చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసు కలిగిన చిన్నారులలో వైరస్ ప్రవేశిస్తుంది. దాంతో దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలున్న కొందరు చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా ఏదో చోట హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.  


చైనాలో కేసులతో భారత్ అలర్ట్


చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ కేసులతో భారత్ అలర్ట్ అయింది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రులలో బెడ్లు సిద్ధంగా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్యశాఖ సూచించింది. వారం, పది రోజుల కిందటే హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమైంది. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రావడంతో శ్వాసకోశ వ్యాధులతో చేరిన వారికి HMPV వైరస్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో HMPV పాజిటివ్ కేసులు పెరగడంతో అత్యధిక జనాభా కలిగిన భారత్ సైతం ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.



ఈ వైరస్ సోకిన వ్యక్తులను నేరుగా కలిసిన వారిలోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ వారిలో హెచ్ఎంపీవీ లక్షణాలు కనిపించకపోవడం ఊరట కలిగిస్తోంది. కరోనా సమయంలో అయితే కోవిడ్19 సోకిన వారిని నేరుగా కలిసిన వారిలో సైతం వైరస్ లక్షణాలు కనిపించేవి. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు, గొంతులో సమస్య, శ్వాసకోశ సమస్య, ఇన్ఫ్లుఎంజా లక్షణాలను ఈ వైరస్ కలిగి ఉంటుంది. చిన్నారులు, వృద్ధులపై వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని, వారిని దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


Also Read: HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే