India France Rafale Deal: ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. ఈ వారం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా వీటి కొనుగోలు ఒప్పంద వివరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించి.. ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందం జరిగితే భారత నావికాదళానికి 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ విమానాలు, 4 ట్రైనర్ విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ లు మిగ్ 29లను నడుపుతున్నాయి. దేశ భద్రత సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను కొనాలని నౌకాదళం భావిస్తోంది.


పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారత్ తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. గత కొన్నేళ్లలో రక్షణరంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు, ఆయుధాలను కొనుగోలు చేసింది. తాజాగా ఫ్రాన్స్ తో భారత్ రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే వైమానిక దళం కోసం రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు నావికా దళం కోసం రాఫెల్-ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం భారత్ 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు అటాక్ సబ్ మెరైన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 13, 14 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఈ కొనుగోలు ఒప్పందంపై మోదీ సంతకం చేసే అవకాశం ఉంది. 


జులై 13న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం 


జులై 14వ తేదీన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుగుతుంది. ఈ రోజు బాస్టిల్ డే పరేడ్ లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అధ్యక్షుడు మక్రాన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మొత్తం డీల్ విలువ రూ. 90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. భారత నౌకాదళానికి 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు జులై 13న జరగనున్న సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


రాఫెల్- ఎం ప్రత్యేకలు 


రాఫెల్ -ఎం అనేది ఒక సముద్ర యుద్ధ విమానం. రాఫెల్-ఎం యుద్ధ విమానానికి రాఫెల్ మారిటైమ్ అని పేరు. ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ రాఫెల్-ఎం విమానాన్ని తయారు చేస్తుంది. రాఫెల్ కంటే 80 శాతం అత్యాధునిక సాంకేతికతతో రాఫెల్-ఎం విమానాన్ని తయారు చేశారు. ఈ విమానాలను సముద్రంపై నిఘా కోసం, పోరాటం చేయడానికి వాడనున్నారు.  అమెరికన్ ఫైటర్ హార్నెట్ కంటే ఈ విమానం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ లను మోహరించనున్నారు. రాఫెల్-ఎం యుద్ధ విమానం 15.27 మీటర్ల పొడవు, 5.34 మీటర్ల ఎత్తు, 10,600 కిలోల బరువు ఉంటుంది. గంటకు 1,912 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో గంటకు 1,390 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 3 డ్రాప్ ట్యాంకులతో 3,700 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. రాఫెల్-ఎం యుద్ధ విమానాల్లో టేకాఫ్, ల్యాండ్ చాలా సులువుగా ఉంటుంది.