North India Floods: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు రాష్ట్రాల్లో విపరీతమైన వానలతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు జనాలను ఆగం చేస్తున్నాయి. ముణ్నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండ్రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, దిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


అతి భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఎడతెరిపి లేని వానలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కులు, మనాలి, కిన్నౌర్, చంబాలో రావి, బియాస్, సట్లూజ్, స్వాన్, చీనాబ్ సహా అన్ని ప్రధాన నుదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భవనాలు, కార్లు, బస్సులు, వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్ లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆకస్మిక వరదలు, కొడచరియలు విరిగిపడుతుండటం రాకపోకలను, సాధారణ జీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. జమ్ముూ కశ్మీర్ లోని కతువా, సాంబా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 






ఇళ్లు విడిచి బయటకు రావొద్దంటూ సీఎం విజ్ఞప్తి


వరదల్లో, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల్లో వాహనాలు, భవంతులు కొట్టుకుపోతుండటం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాబోయే 24 గంటల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ముంపు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. మూడు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించినట్లు తెలిపారు.  మరోవైపు మూడు రోజుల పాటు నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు ప్రారంభించారు. 






2013 తరహాలోనే వాతావరణ పరిస్థితి


పశ్చిమార్థ గోళంలో సంభవించే భౌగోళిక పరిణామాలు(వెస్టర్న్ డిస్ట్రబెన్స్) అతి చురుగ్గా ఉండటం, వాటికి రుతుపవనాలు  తోడవ్వడంతో ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2013 లోనూ ఇలాంటి వాతావరణ చర్యే జరగ్గా.. అప్పుడు ఉత్తరాఖండ్ ను విపరీతమైన వరదలు ముంచెత్తిన విషయం తెిసిందే. జులై మొదటి కొన్ని రోజుల్లో వాయువ్య భారత దేశంలో కురిసిన వర్షపాతం మొత్తం దేశానికి లోటును భర్తీ చేసిందని వాతావరణ విభాగం తెలిపింది. వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిమీకి చేరుకుంది. ఇది సాధారణం కంటే 239.1మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 






వరదల్లో కొట్టుకుపోతున్న భవనాలు, బస్సులు, కార్లు


హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వికాస్ నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ వేస్ బస్సు వరదల్లో చిక్కుకుంది. స్థానికులు ప్రయాణికులను రక్షించారు. బస్సు వరదల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.