Chandrayaan-3: చంద్రయానన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. రష్యాకు కూడా సాధ్యం కానీ ఫీట్ ను భారత్ సాధించింది. ఎంతో ఉత్కంఠకు దారితీసి చివరికి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది.
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్ అక్కడి నుంచి తన తొలి సందేశాన్ని పంపించింది. 'భారత్, నేను నా గమ్యస్థానానికి చేరుకున్నా.. మీరు కూడా..:చంద్రయాన్-3' అనే సందేశాన్ని పంపించింది.
అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్ పోల్ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.
సుమారు చంద్రుడి ఉపరితలం నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉండగా రఫ్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఆ ఫేస్ సజావుగానే సాగినట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 1200 మీటర్స్ పర్ సెకండ్ గా ల్యాండర్ వేగం ఉంది. ఒక్కసారి ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్ (ఏఎల్ఎస్) యాక్టివేట్ అయిన అనంతరం గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎలాంటి కమాండ్స్ ఇవ్వబోరని లైవ్ స్ట్రీమింగ్ కామెంటరీలో చెప్పారు.
చంద్రుడి ఉపరితలం నుంచి 28 కిలో మీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్ వర్టికల్ వెలాసిటీ 31 మీటర్స్ పర్ సెకండ్, హారిజాంటల్ వెలాసిటీ 1058 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన సరిగ్గా 8 నిమిషాల తర్వాత 21 కిలో మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఉంది. అప్పుడు హారిజాంటల్ వెలాసిటీ 745 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 67 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీలో ఉంది. ఈ 8 నిమిషాల్లో 700 కిలో మీటర్లకు పైగా దూరం ల్యాండర్ ప్రయాణించింది.
రఫ్ బ్రేకింగ్ ఫేస్ తర్వాత స్టాండ్ బై స్టేజ్ లేదా ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేస్ మొదలు అయింది. తర్వాత పైన్ బ్రేకింగ్ ఫేస్ మొదలు అయింది. ఇది మూడు నిమిషాలపాటు జరుగుతుంది. ఈ సమయంలో కూడా ఎలాంటి కమాండ్స్ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఇవ్వలేదు. ఈ సమయంలో హారిజాంటల్ వెలాసిటీ 120 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 28 మీటర్స్ పర్ సెకండ్ గా ఉంది. సరిగ్గా ఈ టైంలో ఉపరితం నుంచి ఎత్తు 1.2 కిలో మీటర్లుగా ఉంది. ఆ తర్వాత ల్యాండర్ ఉపరితలానికి లంబకోణం చేస్తూ తిరిగింది. మెల్లగా సెన్సార్ల సాయంతో హారిజాంటల్ వెలాసిటీ, వర్టికల్ వెలాసిటీని మరింత తగ్గించుకొని చంద్రుడి ఉపరితలం వైపు కదులుతూ ఉంది. చంద్రుడిపై దిగే ముందు హారిజాంటల్ వెలాసిటీ 0.4 మీటర్స్ పర్ సెకండ్, వర్టికల్ వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ గా ఉండి చివరికి ఉపరితలంపై క్షేమంగా దిగింది.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి