The Center Will Bring A New Rule Of One Charger For All Phones: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(e-waste)  విపరీతంగా పెరిగిపోతున్న వేళ... కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కామన్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వైపుగా ప్రయాణిస్తున్న వేళ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. 2026 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో USB-C ఛార్జర్లు తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను జారీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఛార్జింగ్ సొల్యూషన్‌లను ప్రామాణీకరించడానికి... ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం మొత్తం ఇప్పటికే సీ టైప్‌ ఛార్జర్ల వైపే అడుగులు వేసి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గిస్తున్న వేళ భారత్‌ కూడా అదే విధానం అవలంభించేందుకు సిద్ధమైంది.


ఫోన్‌ ఛార్జర్లకు 2025 వరకే 

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2025 జూన్ నాటికి USB-C కనెక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనల్లో పొందిపరిచినట్లు తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసే సంస్థలు వాటి ఛార్జింగ్‌ కోసం తప్పనిసరిగా USB-C పోర్ట్‌లను 2026 చివరి నాటికి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్దేశించనుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది నుంచి USB-C కనెక్టివిటీని తప్పనిసరి చేస్తూ ఐరోపా సమాఖ్య నిబంధనలు రూపొందించింది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లన్నీ యూనివర్సల్ ఛార్జింగ్ కేబుల్‌ని ఉపయోగిస్తాయని...దీనివల్ల ఛార్జర్‌లు, కేబుల్స్‌ను వినియోగించే సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఫోన్‌కు ఒక్కో రకమైన ఛార్జర్‌ అందుబాటులో ఉండడంతో చాలామంది వినియోగదారులకు ఛార్జింగ్‌ పెద్ద సమస్యగా మారుతోంది. అది కాకుండా  అన్ని ఫోన్లకు ఒకే ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉంటే ఎక్కువ ఛార్జర్ల సమస్య ఉండబోదని కేంద్రం వివరిస్తోంది. టాబ్లెట్‌లు, విండోస్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐ ప్యాడ్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లకు కూడా ఒకే రకమైన ఛార్డింగ్ పోర్ట్‌లను అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది.

 

వాచ్‌లకు కూడానా...

ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లతో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్‌ ఫీచర్‌ ఫోనల్‌కు కూడా ఒకేరకమైన టైప్‌ సీ ఛార్జర్‌లను అందుబాటులోకి తేవడంపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ... ఇప్పటికే పరిశ్రమల ప్రముఖులతో చర్చలు ముగిశాయని... దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది. బహుళ రకాల ఛార్జర్‌లు, కేబుల్‌ల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులను ఈ నిర్ణయంతో తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని కేంద్రం తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి ఎలాంటి అవరోధాలు ఉండవని... పర్యావరణ అనుకూల భవిష్యత్తును భారత్‌ హామీ ఇస్తుందని కేంద్రం తెలిపింది.