India Economy Growing : భారత ఆర్థిక వ్యవస్థ (India Economy) గురించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా( America)లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University)విద్యార్థులతో ఇటీవల భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రసంశలు కురిపిస్తూనే, అనేక అంశాలను లేవనెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నా, సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉంటోందన్నారు రాహుల్ గాంధీ. ఈ కారణంగానే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక విధానం అప్పులపై ఆధారపడి ఉందన్న ఆయన, ఉపాధి కల్పన, సంపదను సృష్టించడం వంటివి దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డారు.
సంపద కొంత మంది చేతుల్లోనే...
ఈ నెల 15న అమెరికాలోని హర్వర్డ్ యూనివర్శిటీలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓ విద్యార్థి భారత ఆర్థికాభివృద్ధి గురించి ప్రశ్నించారు. దేశం ఆర్థికాభివృద్ధిలో ప్రగతి సాధిస్తున్నప్పటికీ, ఎవరి ప్రయోజనాలకు అనుకూలంగా ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. ఆర్థికాభివృద్ధి మంచి స్థితిలోనే ఉన్నా...ఎవరెవరు లబ్దిపొందుతున్నారన్న అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు అందరికీ దక్కడం లేదని అననారు. ప్రజలతో కలిసిపోయి, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించాల్సి ఉందన్నారు. స్వీయ దయాగుణం ద్వారానే నిజమైన అధికారం సొంతం అవుతుందన్నారు. విద్యార్థులందరూ ఈ విషయాన్ని అలవర్చుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. దేశంలో వృద్ధి నమోదవుతున్నా, కొద్ది మంది వద్దే సంపద కేంద్రీకృతం కావడం ప్రమాదకరమన్నారు. సంపద పంపిణీ కాకపోవడం వల్ల నిరుద్యోగం ఊహించని విధంగా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు.
నిజమైన సమస్య కులమే
భారతదేశంలో నిజమైన సమస్య కులమేనన్న రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం భారత్‌ను రాష్ట్రాల యూనియన్‌గా పరిగణించడం లేదని విమర్శించారు. ఒకే భావజాలం, ఒకే మతం, ఒకే భాష కలిగిన దేశంగా బీజేపీ పాలకులు భావిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలను నియంత్రిస్తోందన్న ఆయన, న్యాయబద్ధ, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యాన్ని భారత్ నడిపిస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని స్పష్టం చేశారు.
విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన పార్లమెంట్
పార్లమెంట్ లో విపక్ష ఎంపీలపై బహిష్కరణ వేటు పడింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో యువత పొగ వెదజల్లిన వెంటనే బీజేపీ ఎంపీలు బయటకు పారిపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ లోకి యువత ఎందుకు ప్రవేశించారనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశమని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతోనే యువత పార్లమెంట్ లోకి వచ్చి నిరసనకు దిగారని అన్నారు. ఉపాధి గురించి మాట్లాడని మీడియా, ఎంపీల రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విపక్ష ఎంపీలు సభలో లేని సమయంలో బిల్లులను అమోదింపజేసుకోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.