Iron Man Jet Pack Suit: ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హైటెక్‌గా మారుతోంది. 'డ్రోన్' నుంచి 'జెట్ ప్యాక్ సూట్' వరకు అన్నింటిని కొనుగోలు చేసేందుకు ఇండియన్ ఆర్మీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఇవి మాత్రమే కాకుండా..'రోబోటిక్ మ్యూల్', 'రోబో మ్యూల్' ను కూడా కొనుగోలు చేయబోతోంది. అయితే ఈ రోబోటిక్ మ్యూల్స్ సైనికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్మీ ఉపకరణాలతో పాటు 100 'రోబోటిక్ మ్యూల్స్' ను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ రోబోటిక్ మ్యూల్స్ ప్రత్యేకత ఏంటి, వాటి వల్ల కల్గే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


గతంలో గాడిదల ద్వారా ఆయుధాలు, ఆహారం పంపిణీ..


లడఖ్‌లోని బార్డర్లలో పని చేసే సైనికులకు ఉపయోగపడే ఆహారం, పరికరాలు, ఇతర అవసరాలను సరఫరా చేసేందుకు ఇండియన్ ఆర్మీ చాలా కష్టపడాల్సి వస్తోంది. అక్కడ ఉన్నదంతా రాతి భూభాగం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోబోటిక్ మ్యూల్స్ దూరంగా ఉన్న సైనికులకు సహాయం చేసేందుకు పనికి వస్తాయి. గతంలో అంటే కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు సంబంధించిన ఆయుధాలు, వస్తువులు, ఆహారాన్ని గాడిదల ద్వారా తరలించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటినే వాడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రోబోటిక్స్ ను వాడుకోవాలని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది. 


ఒక్కసారి కొనుగోలు చేస్తే పదేళ్ల పాటు ఉపయోగం..!




ఈ రోబోటిక్ మ్యూల్స్ అచ్చం జంతువులలాగే నాలుగు కాల్లను కల్గి ఉంటుంది. వీటిని స్వదేశీ కంపెనీ నుంచి మాత్రమే భారత సైన్యం కొనుగోలు చేస్తుంది. రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు, వెడల్పు మరియు ఎత్తు 1 మీటర్ ఉంటుంది. రోబో మ్యూల్ బరువు 60 కిలోల వరకు ఉంటుంది. దీనిని 4000 మీటర్ల ఎత్తులో ఉపయోగించవచ్చు. ఇది సుమారు 10 సంవత్సరాల పాటు పని చేస్తుంది. 




జంతువులకంటే రోబోటిక్ మ్యూల్స్ యే నయం..


సాధారణంగా.. ఒక మ్యూల్ దాని శరీర బరువులో 20% వరకు లేదా దాదాపు 90 కిలోల (198 పౌండ్లు) బరువును మోసేందుకు ఏర్పాట్లు చేయొచ్చు. సైన్యంలో శిక్షణ పొందిన మ్యూల్స్ 72 కిలోల (159 పౌండ్లు) వరకు మోయగలవని సమాచారం. విశ్రాంతి లేకుండా 26 కిమీ (16.2 మైళ్ళు) పరుగెత్తగలవని తెలుస్తోంది. రోబోటిక్ మ్యూల్ వేగం చాలా ఎక్కువ.


మ్యూల్స్ ఉపయోగాలు..!


మ్యూల్స్ పరిమిత సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అదనపు శిక్షణతో వాటిని వాటి సామర్థ్యం కంటే కొంచెం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. భారతీయ సైన్యం రోబోటిక్స్ ను, టెక్నాలజీని వాడుకోవడం ప్రారంభించింది. రాబోయే కాలంలో కూడా జంతువులకు బదులుగా.. పర్వతాలపైకి రోబోటిక్ మ్యూల్స్‌ను పంపించి పనులు చేసే దిశగా ఇండియన్ ఆర్మీ కృషి చేస్తోంది.