IIT Bombay: ఐఐటీ బాంబేకు విరాళాలు పోటెత్తుతున్నాయి. పూర్వ విద్యార్థులు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని రూ. 315 కోట్ల భారీ మొత్తం విరాళంగా ఇచ్చిన విషయం మర్చిపోకముందే.. దాదాపు నెలల తర్వాత మరో భారీ మొత్తాన్ని మరో విద్యార్థి ఒకరు విరాళంగా అందించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - బాంబే కు అజ్ఞాత దాత రూ. 160 కోట్లు విరాళంగా ఇచ్చారు.
అయితే ఈ విరాళం అందించిన వ్యక్తి పేరును ఆయన కోరిక మేరకు బయటపెట్టలేదు. తాజా నిధులతో అంతర్జాతీయ వాతావరణ సంక్షోభ పరిష్కారాల్లో ఐఐటీ బాంబే ముఖ్యపాత్ర పోషించే అవకాశం మెరుగు పడుతుంది. ముంబయి శివార్లలోని పోవైలో గల ఐఐటీ బాంబే ప్రాంగణంలోనని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎకడమిక్ భవనంలో ప్రతిపాదిత పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. క్లిష్టమైన కీలక అంశాలపై ఈ పరిశోధన కేంద్రం దృష్టి సారించనుందని విద్యా సంస్థ ప్రకటనలో పేర్కొంది. ఇంత భారీ మొత్తంలో ఓ విద్యా సంస్థకు విరాళాలు ఇవ్వడం భారతీయ విద్యారంగంలో అరుదైన ఘటన అని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి అన్నారు. గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ రీసెర్చ్ హబ్ ఏర్పాటు కోసం ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ ఐఐటీ బాంబే తెలిపింది.
'అత్యాధునిక పరిశోధనలు, ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని ప్రోత్సహించడం, వ్యవస్థాపక ప్రయత్నాలను పెంపొందించడం ద్వారా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ కేంద్రం మెరుగ్గా పని చేస్తుంది' అని ప్రొఫెసర్ ఛౌదురి తెలిపారు.
Also Read: MGNREGS: బ్యాంకు ఖాతాలోనే ఉపాధి హామీ డబ్బుల జమా, సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
నందన్ నీలేకని భూరి విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్, ఆధార్ రూపకర్త నందన్ నీలేకని కొన్ని రోజుల క్రితం ఐఐటీ బాంబేకు రూ. 315 కోట్ల భూరి విరాళం సమర్పించారు. గతంలోనూ ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ. 85 కోట్లు విరాళం ఇచ్చారు. అలా మొత్తంగా నందన్ నీలేకని ఒక్కరే రూ. 400 కోట్లు విరాళంగా ఇవ్వడం విశేషం. ఐఐటీ బాంబే నుంచి 1973లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు నందన్ నీలేకని. ఐఐటీ బాంబేతో 50 ఏళ్లుగా తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 1999 నుంచి ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో దశాబ్దం పాటు కొనసాగారు. 2005 నుంచి 2011 మధ్య గవర్నర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. గతంలో కొత్త హాస్టల్ భవన నిర్మాణం, వర్సిటీ ఇంక్యుబేటర్ నిర్మాణానికి రూ.85 కోట్లు నిధులు విరాళంగా అందించారు. 1999 లో ఐఐటీ బాంబే నుంచి అలుమ్నస్ అవార్డు, 2019లో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.
ఐఐటీ బాంబే తనకెంతో ఇచ్చిందని.. తన జీవితానికి పునాది పడింది అక్కడేనని అంటారు నందన్ నీలేకని. గ్లోబల్ గా ఐఐటీ బాంబే ఎదగడానికి ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐఐటీ బాంబే 1958లో స్థాపితమైంది. దేశంలో ఏర్పాటైన రెండో ఐఐటీ ఇదే. సుమారు 62,500 మంది ఇంజినీర్లు, సైంటిస్టులు ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్లుగా పట్టాలు పొందారు.