Agnipath scheme: దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్' పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో ఖాళీలకు 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
వాయుసేన అగ్నిపథ్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24న ప్రారంభం అయింది. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.
నేవీలో
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై భారత నౌకా దళం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ నేవీలోకి తీసుకునే ఫస్ట్ బ్యాచ్ అగ్నివీరుల్లో 20 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేవీకి చెందిన వివిధ ప్రాంతాల్లో వీరిని రిక్రూట్ చేస్తామని పేర్కొంది. 2022లో మొత్తం 3 వేల మంది అగ్నివీరులను తీసుకుంటామని ప్రకటించింది.
10 వేల మంది
నౌకాదళంలో మొదటి బ్యాచ్ అగ్నివీరుల కోసం జులై 1న రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 10 వేల మంది యువతులు ఇందుకోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను జూన్ 15- జులై 30 వరకు ప్రాసెస్ చేస్తారు.
" భారత నౌకాదళంలోకి తీసుకునే అగ్నివీరుల నియామకాల్లో ఎలాంటి లింగ భేదం లేదు. పురుషులు, మహిళలు ఇద్దరినీ ఇందులోకి తీసుకుంటాం. భారత నౌకాదళానికి చెందిన వివిధ నౌకల్లో 30 మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు అగ్నివీరుల నియామకాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. వారిని యుద్ధ నౌకల్లో కూడా విధుల కోసం పంపవచ్చు. "
-దినేశ్ త్రిపాఠీ, వైస్ అడ్మిరల్