గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు తండ్రి కూతుళ్లు. కర్ణాటకలోని బీదర్ స్టేషన్‌లో Hawk-132కి సంబంధించిన ఫార్మేషన్‌లో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కూతురు ఫ్లైయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ ఒకే ఆపరేషన్‌లో పాల్గొని చరిత్ర సృష్టించారు. యుద్ధ విమానం ముందు వీళ్లిద్దరూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 30వ తేదీ ఈ అరుదైన ఫీట్ జరిగిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. బీదర్‌లో జరిగిన Hawk-132 ఫార్మేషన్‌లో తండ్రి కూతుళ్లు పాల్గొన్నారని, అనన్య శర్మ ప్రస్తుతానికి ట్రైనింగ్ తీసుకుంటోందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. రక్షణ శాఖకు చెందిన గుజరాత్ డివిజన్ ఈ ట్వీట్ చేసింది. "ఒకే మిషన్‌లో తండ్రి కూతుళ్లు కలిసి ఫార్మేషన్‌లో పాల్గొనటం, గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
అనన్య శర్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో ఎయిర్ ఫోర్స్‌లో ఫైట్ పైలట్‌గా సెలెక్ట్ అయింది. అనన్య తండ్రి సంజయ్ శర్మ, 1989 నుంచి ఎయిర్ ఫోర్స్‌లోనే సేవలందిస్తున్నారు. యుద్ధ విమానాలకు సంబంధించిన ఎయిర్ కమొడోర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అనన్య శర్మ ప్రస్తుతానికి బీదర్‌లో శిక్షణ తీసుకుంటోంది.