Mukhtar Abbas Naqvi Resigns:  ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆయన రాజీనామా చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.






రాజ్యసభ సభ్యునిగా నఖ్వీ పదవీకాలం ముగిసింది. ఆయనకు భాజపా మరోమారు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీని కలిసి ఆయన రాజీనామా పత్రం సమర్పించారు.


కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా కొన‌సాగిన న‌ఖ్వీ.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గురువారంతో ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం కూడా ముగియ‌నుంది. ప్ర‌ధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర‌మంత్రులుగా కొన‌సాగుతున్న‌ రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ.. అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా కేబినెట్ మంత్రులుగా ప‌ని చేశారు.


ఉపరాష్ట్రపతిగా


మరోవైపు నఖ్వీకి రాజ్యసభ కోసం మరో ఛాన్స్ ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.


మరోవైపు ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు కూడా తాజాగా వినిపించింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


ఆరోజే


ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇటీవలే ప్రకటన విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.


జులై 5వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 19 వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ అనివార్యమైతే.. ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కౌంటింగ్ కూడా అదే రోజు జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.


Also Read: Agnipath scheme: 'అగ్నిపథ్‌'కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు- ఒక్క వాయుసేనలోనే 7.5 లక్షలు!