Nitish Kumar Remarks:
నితీశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
జనాభా నియంత్రణపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై I.N.D.I.A కూటమి నేతలు స్పందించారు. మహిళలపై అంత నీచంగా మాట్లాడిన నితీశ్ వ్యాఖ్యల్ని విపక్ష కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఈ క్రమంలోనే...కాంగ్రెస్ విమర్శలు గుప్పింది. ఇప్పటి వరకూ ఎవరూ అలాంటి భాష మాట్లాడలేదని మండి పడ్డారు కాంగ్రెస్ నేత పి చిదంబరం (P Chidambaram). ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు.
"నితీశ్ కుమార్ నోరు జారారు. ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సారీ చెప్పారు. కానీ...దేశంలో మరెక్కడా ఇలాంటి భాష వాడకూడదు"
- పి చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
నిర్మలా సీతారామన్ అసహనం..
నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు వరస పెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మండి పడ్డారు. విపక్ష కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదో మీడియా ప్రశ్నించాలని అన్నారు.
"నితీశ్ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గు చేటు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ సీనియర్ నేత ఇలాంటి మాటలు మాట్లాడడం అవమానకరం. మహిళలపై అసెంబ్లీలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు I.N.D.I.A కూటమి నేతలు ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు ఖండించడం లేదు. మీడియా అంతా వాళ్లను ప్రశ్నించాలి"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
ఆగని విమర్శలు..
బీజేపీ నేత బన్సూరీ స్వరాజ్ కూడా నితీశ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుల్ని క్షమించకూడదని తేల్చి చెప్పారు. మహిళలను గౌరవించడం బీజేపీ సిద్ధాంతం అని స్పష్టం చేశారు.
"నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని అసలు క్షమించకూడదు. మహిళల్ని గౌరవించడం బీజేపీ సిద్ధాంతం. మన దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేత ఆయన. కానీ ఆ విషయం మర్చిపోయి సీఎం పదవిలో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడారు"
- బన్సూరి స్వరాజ్, బీజేపీ నేత
Also Read: నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు