MahaKumbhs Final Snan: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

MahaKumbh 2025 | కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది.

Continues below advertisement

Final snan at MahaKumbh | ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి  సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటివరకు దాదాపు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు పవిత్రమైన శివరాత్రి కావడం, కుంభమేళా సైతం ముగియనుండటంతో ఆఖరి పుణ్యస్నానాల కోసం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు.

Continues below advertisement

అర్ధరాత్రి నుండి భక్తులు త్రివేణి సంగమంలో చివరి పుణ్యస్నానం ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 'బ్రహ్మ ముహూర్తం' సమయం నుంచి ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు మొదలయ్యాయి. మహా కుంభ చివరి రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న డ్రోన్ విజువల్స్‌ ప్రభుత్వం షూట్ చేసింది. మరోవైపు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. ఇటీవల పలుమార్లు ముఖ్యమైన రోజులలో భక్తులపై పూల వర్షం కురిపించారు అధికారులు. తాజాగా మహాశివరాత్రి, అందులోనూ కుంభమేళా ముగింపు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న వారిపై పూలు చల్లారు. 

ఓ భక్తుడు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చివరి పుణ్యస్నానం ఆచరించడానికి ఇక్కడికి వచ్చాం. మా సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేం. మహా కుంభ చివరి రోజు కనుక ఇక్కడికి వచ్చి  గంగాదేవి ఆశీస్సులు పొందడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. జనవరి 13న 'పౌష పూర్ణిమ'లో మొదటి అమృత స్నానం ప్రారంభమైంది. ఆ తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రోజు, జనవరి 29వ తేదీన 'మౌని అమావాస్య' రోజు కుంభమేళాలో మరో పుణ్యస్నానాలు పెద్ద ఎత్తున జరిగాయి. మూడవ ప్రధాన పవిత్ర స్నానం ఫిబ్రవరి 3న బసంత్ పంచమి రోజు, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజు, ఫిబ్రవరి 26న మహా శివరాత్రిని పురస్కరించుకుని చివరి అమృత స్నానం చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. 

స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి ఎక్కువైందని ఎస్ఎస్పీ మహా కుంభ్ రాజేష్ ద్వివేది తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో చివరి పవిత్ర స్నానం చేయడం చేయడానికి అర్ధరాత్రి నుండి భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం చర్యలతో ఏ ఇబ్బంది జరగకుండా కుంభమేళా ముగుస్తుంది. కుంభమేళాలో పాల్గొంటున్న వారు అనంతరం వారణాసిలో కాశీ విశ్వనాథుడ్ని గానీ, లేక అయోధ్యలో రామ మందిరాన్ని సైతం దర్శించుకుంటున్నారు.

 

Continues below advertisement
Sponsored Links by Taboola