కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్‌పురాలోని హోయసల దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. 'హోయసల పవిత్ర బృందాలు' అని  పిలవబడే.. హొయసల ఆలయాల పవిత్ర స్మారక చిహ్నాలు 2014, ఏప్రిల్‌ 15 నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇవి మన దేశ గొప్ప చారిత్రక, సాంస్కృతిక  వారసత్వానికి సాక్ష్యాలు. హొయసల దేవాలయాలు 12-13వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. హొయసల శకంలోని కళాకారులు, వాస్తుశిల్పుల సృజనాత్మకత, నైపుణ్యానికి అవి  ప్రతీకగా నిలుస్తున్నాయి. 


హోయసల దేవాలయాలు.. భారత పురావస్తు శాఖ కింద రక్షిత స్మారక చిహ్నాలుగా ఉన్నాయి. ASI వాటిని సంరక్షిస్తోంది. వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. 2022-2023 సంవత్సరానికి గానూ కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథపురలోని గొప్ప హోయసల దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నామినేట్ చేశారు.  హొయసల సామ్రాజ్యం 10వ, 14వ శతాబ్దాల మధ్య ఆధునిక కర్ణాటక రాష్ట్రంలోని అధిక భాగాన్ని పాలించింది. సామ్రాజ్యం యొక్క రాజధాని మొదట బేలూరులో ఉంది ఆ  తరువాత హళేబీడుకు మార్చబడింది. 14వ శతాబ్దంలో... ఢిల్లీ సుల్తాన్‌ దాడుల్లో హళేబీడు ధ్వంసమైంది. 


హోయసలేశ్వర ఆలయం.. దీనిని హళేబీడు ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది 12వ శతాబ్దపు అద్భుతమైన శిల్పా కళాఖండం. ఒకప్పుడు హొయసల సామ్రాజ్యానికి  రాజధానిగా పనిచేసిన కర్ణాటకలోని సుందరమైన పట్టణం హళేబీడు. రాజవంశం వారి ఆధ్యాత్మిక విశ్వాసాలు, కళాత్మకత, లోతైన భక్తిని ప్రదర్శిస్తూ.. ఈ ఆలయాన్ని  విష్ణువర్ధన రాజు నిర్మించారు. 


హొయసల దేవాలయాలు ప్రాథమిక సాంప్రదాయ ద్రవిడియన్‌ స్వరూపాన్ని కలిగి ఉన్నాయి. అయితే మధ్య భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే భూమిజా మోడ్, ఉత్తర,  పశ్చిమ భారతదేశంలోని నాగర సంప్రదాయాలు, కళ్యాణి చాళుక్యులు ఇష్టపడే కర్ణాట ద్రావిడ రీతిని కళ్లకు కడుతుంది. వాస్తుశిల్పులు వివిధ రకాల ఆలయ నిర్మాణాల నుంచి  ప్రేరణ పొంది.. హొయసల దేవాలయాల రూపకల్పన చేశారు. ఈ ఆలయాల్లో శైవమత సంప్రదాయంలో పాతుకుపోయినప్పటికీ.. వైష్ణవం, శక్తిమతంకు సంబంధించిన అంశాలు  కూడా కళాఖండాల్లో కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు జైనమతాన్ని కూడా ప్రదర్శిస్తాయి. జైనమతంలో వస్త్రధారణను తెలుపుతాయి. బేలూరులో సమీపంలోని కేశవ దేవాలయం  భారతదేశ నిర్మాణ వారసత్వంలో.. ఆ ప్రాంత ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఆలయాలలోని పుణ్యక్షేత్రాలు మొత్తం నిర్మాణ ఉపరితలాన్ని కప్పి ఉంచే హైపర్-రియల్  శిల్పాలన్నీ.. రాతి శిల్పాలే. ప్రదక్షిణ వేదిక, పెద్ద ఎత్తున శిల్పకళా గ్యాలరీ, బహుళ-స్థాయి శిల్పకళ ను కలిగి ఉందని యునెస్కో అధికారికంగా ప్రకటించింది. యునెస్కో  గుర్తింపుతో హొయసల దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది.