Upskill: సాంకేతికత రోజుకో కొత్తపుంతలు తొక్కుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా రంగాల్లో రాణించాలంటే నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే అక్కడా, ఇక్కడా, ఆ దేశం, ఈ దేశం అంటూ అంటూ తేడా లేదు. ప్రతి దాంట్లో భారతీయుల పాత్ర ఉండాల్సిందే. అలాగే కొత్త రంగాల్లో రాణించేందుకు భారతీయులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి భారతీయులు ఎక్కువగా వీటిపై ఆధారపడుతున్నారు.



ఆన్‌లైన్ కోర్సులు, ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు
ఎక్కువ మంది భారతీయులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి Coursera, Udemy, edX, Khan Academy వంటి ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు సాంకేతికత, వ్యాపారం, కళలు, భాషల వరకు వివిధ విషయాలపై విస్తృత శ్రేణి కోర్సులను అందిస్తున్నాయి.

వృత్తిపరమైన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు
ప్రఖ్యాత సంస్థలు జారీ చేసే ధ్రువపత్రాలకు చాలా విలువ ఉంటుంది. అందుకే భారతీయులు తమ కెరీర్ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ (PMP), సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ (CSM), Google క్లౌడ్ సర్టిఫికేషన్‌ కోర్సులను అభ్యసిస్తున్నారు.

ఉన్నత విద్య
మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు వంటి అధునాతన డిగ్రీలు సైతం నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మార్గాలుగా మారాయి. వీటిలో  డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రత్యేకమైన వాటిని భారతీయులు నేర్చుకోవాడానికి ఇష్టపడుతున్నారు.

కోడింగ్ బూట్‌క్యాంప్‌లు
సాంకేతిక నైపుణ్యాల మెరుగు ప్రక్రియలో కోడింగ్ బూట్‌క్యాంప్‌లకు ఆదరణ పెరిగింది. ఇందులో స్వల్పకాలంలో  ప్రాక్టికల్ కోడింగ్ నైపుణ్యాలను బోధిస్తారు.  అలాగే చాలా మంది నిపుణులు తమ సంబంధిత రంగాల్లో రాణించడానికి తాజా ట్రెండ్‌లు, ఉత్తమ అభ్యాసాలతో అప్‌డేట్‌గా ఉండటానికి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, లైవ్ శిక్షణా సెషన్‌లను ఆశ్రయిస్తున్నారు.

ఇతర భాషా ప్రావీణ్యం
ప్రపంచం మొత్తం ఇంగ్లీష్‌ ద్వారా ఎక్కువ కనెక్ట్ అవుతోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయలు ఇతర భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మాండరిన్, స్పానిష్ వంటి విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా  IT మరియు కస్టమర్ సేవ కెరీర్ వృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

సాఫ్ట్ స్కిల్స్ డెవలప్‌మెంట్
కమ్యూనికేషన్, లీడర్‌షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు కెరీర్ పురోగతికి కీలకమైనవి. భారతీయులు ఈ సాఫ్ట్ స్కిల్స్‌ పెంచుకోవడానికి వర్క్‌షాప్‌లు, కోర్సులను నేర్చుకుంటున్నారు.

నెట్‌వర్కింగ్, మెంటర్‌షిప్: ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం, పరిశ్రమలలో నిపుణుల నుంచి మెంటర్‌షిప్ తీసుకోవడం ద్వారా కెరీర్ వృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నిపుణుల నుంచి సబ్జెక్ట్ నేర్చుకోడంతో పాటు, జీవతంలో రాణించడానికి వారి మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు.

సొంతంగానే..
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండడం, ఉచిత విద్యా వనరులు సమృద్ధిగా ఉంటున్నాయి. దీంతో చాలా మంది వ్యక్తులు స్వీయ-అధ్యయన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి బ్లాగులు, యూట్యూబ్, ట్యుటోరియల్‌లు, ఓపెన్ సోర్స్ కోర్సు మెటీరియల్‌లను ఉపయోగిస్తున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలు
నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు శిక్షణను అందించడంతో పాటు శ్రామిక శక్తి,  ఉపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.