Himachal Rains: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి కుదిపేసింది. భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. దట్టంగా, ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహించి వరదలకు కారణం అయ్యాయి. కొండ చరియలు విరిగిన, రోడ్లు తెగిపోయి, వంతెనలు, భవనాలు నీటిలో కొట్టుకుపోవడంతో 346 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల రెండు నెలల్లో దాదాపు రూ.8,100 కోట్ల నష్టం వాటిల్లినట్లు హిమాచల్ ప్రదేశ్ సర్కారు అంచనా వేసింది. ఈ ఏడాది వినాశకర వర్షాల ప్రభావం నుంచి కోలుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ కు సంవత్సరకాలం పడుతుందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గతంలో చెప్పుకొచ్చారు. ఈ ప్రకృతి విలయాన్ని విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అరుదైన తీవ్ర కలిగిన జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని హిమాచల్ ప్రదేశ్ కోరింది.
భారత వాతావరణ కేంద్రం జూన్ 24న హిమాచల్ ప్రదేశ్ లో రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, మేఘాల విస్ఫోటనాలతో కొండచరియలు విరిగి పడటం, వరదలు సంభవించడం వల్ల చాలా నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం, రుతుపవనాల వర్షాల వల్ల రూ. 8099.46 కోట్ల నష్టం సంభవించింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 346కు చేరుకుంది. అలాగే 38 మంది గల్లంతయ్యారు. వివిధ వర్షాలకు సంబంధించిన దుర్ఘటనల్లో 331 మంది గాయపడినట్లు సమాచారం.
వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు తెగిపోవడం, వంతెనలు, భవనాలు కూలిపోవడం వల్ల 2,216 నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 9,819 నివాస సముదాయాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. 300 దుకాణాలు, 4,702 గోశాలలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 130 కొండచరియలు విరిగిపడగా, 60 ఆకస్మిక వరదలు సంభవించాయి. వివిధ శాఖల పరిధిలో జరిగిన నష్టాలను ఇలా ఉన్నాయి.
- జలశక్తి విభాగం: రూ. 1860.52 కోట్లు
- పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: రూ. 2,712.19 కోట్లు
- హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్: రూ. 1,707.35 కోట్లు
- హార్టికల్చర్: రూ. 173.3 కోట్లు
- పట్టణాభివృద్ధి: రూ. 88.82 కోట్లు
- వ్యవసాయ శాఖ: రూ. 335.73 కోట్లు
- గ్రామీణాభివృద్ధి: రూ. 369..53 కోట్లు
- విద్య శాఖ : రూ. 118.93 కోట్లు
- మత్స్యశాఖ: రూ. 13.91 కోట్లు
- ఆరోగ్య శాఖ: రూ. 44.01 కోట్లు
Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?
హిమాచల్ ప్రదేశ్ కు వరద సాయం కింద కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు ఒక్కొక్కటి రూ. 15 కోట్లు విరాళంగా ఇచ్చాయి. కేంద్ర సర్కారు ఇప్పటి వరకు రూ. 200 కోట్లు సాయం ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా రూ.11 కోట్లు అందించింది.