Surgical Strike: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో ఉన్నట్టుండి మెరుపు దాడి చేసి శత్రు భూభాగాన్ని, శత్రువులను నాశనం చేసి, మనవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వచ్చేసింది మన సైన్యం. సర్జికల్ స్ట్రైక్ అప్పట్లో పెను సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి భారత సైన్యం పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిందంటూ కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ మీడియా కథనాలపై తాజాగా భారత సైనిక ఉన్నతాధికారులు స్పందించారు. 


పాకిస్థాన్ లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినట్లు వస్తున్న వార్తా కథనాల్లో వాస్తవం లేదని, ఆయా కథనాలను నమ్మవద్దని సైన్యం పేర్కొొంది. అయితే బాలాకోట్ సెక్టార్ జమ్మూ అండ్ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LOC) వెంట పాకిస్థాన్ చొరబాటును అడ్డుకున్నట్లు ధ్రువీకరించింది. నియంత్రమ రేఖను దాటి అక్రమంగా భారత్ లోకి చొరబడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. 


బాలాకోట్ సెక్టార్ లోని హమీర్ పూర్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు, దట్టమైన ఆకులు, అలలుగా ఉండే నేల లాంటి వాతావరణాన్ని ఉపయోగించుకుని భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లు భారత సైనికాధికారులు తెలిపారు. పాక్ వైపు నుంచి భారత్ భూభాగంలోకి అడుగు పెట్టగానే ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు కాల్చి చంపారు. వారి నుంచి ఒక ఏకే- 47 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, 30 రౌండ్ల మందుగుండు సామగ్రి, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, పాకిస్థాన్ ముద్రలు ఉన్న మెడిసిన్ స్ట్రిప్ లను స్వాధీనం చేసుకున్నారు.


Also Read: Bharat NCAP: అక్టోబర్ నుంచి ప్యాసింజర్ కార్లకు కొత్త సేఫ్టీ రేటింగ్, స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ


బాలాకోట్ సెక్టార్ నుంచి నియంత్రణ రేఖను దాటడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న వివిధ గూఢచార, నిఘా వర్గాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సైనికులు అప్రమత్తమయ్యారు. ఈ ఇన్‌పుట్‌ ల ఆధారంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అంతకు ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం మరో సర్జికల్ స్ట్రైక్ చేసి నాలుగు టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రాంతీయ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. ఈ రిపోర్టును సైన్యం ఖండించింది. పాక్ పై ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది. 


సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక రకమైన మిలిటరీ అటాక్. ఇందులో సైన్యం నిర్దేశిత లక్ష్యాలను మాత్రమే గురి తప్పకుండా ఛేదిస్తుంది. చుట్టు పక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటిని సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం ఎంతో కష్టం. దీనికి పక్కా ప్లానింగ్ అవసరం. ఇండియన్ ఆర్మీకి చెందిన పారాచూట్ రెజిమెంట్ కు చెందిన పారా కమాండోలు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధహస్తులు. నేవీకి చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్ కు చెందిన గరుడాలకు కూడా ఈ తరహా దాడుల్లో ప్రావీణ్యం ఉంటుంది.