PM Modi Receives Ceremonial Welcome In South Africa: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్షిణాఫ్రికాలో ఘన స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ  జొహాన్నెస్‌బర్గ్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. బ్రిక్స్‌ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఓ క్రమ పద్ధతిలో అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో తాము సమావేశం అవుతున్నామని మోదీ అన్నారు.


ఎయిర్ పోర్టులో అక్కడి ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులతో కరచాలనం చేస్తూ వారితో నూతనోత్సాహాన్ని నింపారు. వారిలో ఓ బుడ్డోడు ఏకంగా హారతి పళ్లెంతో కనిపించాడు. హారతి ఇచ్చి ప్రధాని మోదీకి ఆ బాలుడు స్వాగతం పలకడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోదీకి స్వాగతం పలికిన వారిలో ఆ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మోదీ మా హీరో, అద్భుతమైన నేత అంటూ ప్రవాస భారతీయులు నినాదాలు చేశారు.


ప్రధాని మోదీకి పనిలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోవాలని భారతీయ కమ్యూనిటీకి చెందిన ఓ సభ్యుడు ఆకాంక్షించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని భారత కమ్యూనిటీ సభ్యురాలు, యాషికా సింగ్ దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు 'రాఖీ థాలీ'ని సిద్ధం చేశారు. అందులో మొదటి రాఖీ గణేశుడి ఆకారంలో ఉంది. ప్రధాని మోదీకి ఈ సదస్సులో ఎలాంటి అడ్డంకులు కలగకూడదని, అవాంతరాలు తొలగిపోవాలని ప్రార్థించారు. రెండవ రాఖీ కూర్మావతారం ఆకారంలో కనిపించింది. ప్రధాని తమకు సోదరుడు అని, రక్షణ కోసం కట్టే రాఖీలు తెచ్చామన్నారు.






బ్రిక్స్ సమావేశాలకు రష్యా అధినేత గైర్హాజరు..
ఆగస్టు 22- 24 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్‌ దేశాధినేతలు 2019 తర్వాత నేరుగా హాజరవుతున్న తొలి సమావేశం ఇది. ఈ సదస్సు పూర్తి చేసుకుని ప్రధాని మోదీ గ్రీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు.  అయితే బ్రిక్స్ సమ్మిట్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరు కావడం లేదు. ఆయనకు బదులుగా రష్యా దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారా అనే విషయంపై స్పష్టత లేదు. 
 Also Read: Surgical Strike: పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్! మీడియాలో కథనాలు - భారత ఆర్మీ ఏం చెప్పిందంటే?