Meta Warning:


ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta) ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌ పాలసీని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.


కరోనా వైరస్‌ ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) సంస్కృతి పెరిగింది. ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు ఇంటి వద్ద నుంచే పనిని ప్రోత్సహించాయి. గతేడాది నుంచి కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి. ఒక వేళ వీలు కాకుంటే వారంలో కనీసం మూడు రోజులైనా రావాలని అడుగుతున్నాయి. దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆఫీసులకు రావడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు.


వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేయాలని ఫేస్‌బుక్‌ నిబంధన పెట్టింది. కొందరు ఉద్యోగులు దీనిని లైట్‌ తీసుకున్నారని సమాచారం. ఇలాంటి వారికి మెటా మానవ వనరుల అధినేత లోరీ గోలెర్‌ మెమోలు జారీ చేశారని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రిపోర్టు చేసింది.


'ఇక నుంచి మేనేజర్లు ప్రతి నెలా బ్యాడ్జ్‌, స్టేటస్‌ టూల్‌ సమాచారాన్ని సమీక్షిస్తారు. నిబంధనలు పాటించని వారిని ప్రశ్నిస్తారు. స్థానిక నిబంధనలను పరిగణనలోకి తీసుకొనే పనిచేస్తారు' అని మెమోలో ఉన్నట్టు తెలిసింది.


ప్రాంతాలను బట్టి మెటా నిబంధనలు అమలు చేస్తోంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మూడు రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేయాలన్న నిబంధన ఉంది. యాపిల్‌, గూగుల్‌ సైతం ఇలాగే చేస్తున్నాయి. భారత్‌లోనూ టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ కంపెనీలు ఇదే దారిలో నడుస్తున్నాయి.


ఉద్యోగులు ఆఫీస్‌లో పని చేయాలన్న నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదని గోలెర్‌ స్పష్టం చేశారు. పదే పదే ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెర్ఫామెన్స్‌ రేటింగ్‌ తగ్గిస్తామని, సరిదిద్దుకోకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని తెలిపారు.


అందరు ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని మెటా చెప్పడం లేదు. కొందరికి రిమోట్‌ పాలసీని అమలు చేస్తోంది. రెండు నెలలకు నాలుగు రోజులు మాత్రమే రావాలని చెబుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ పనితీరులో మార్పులు వస్తాయని అంటోంది. ఇక ఆఫీసులో పని చేసేందుకు అంగీకరించిన ఉద్యోగులకు బలమైన మద్దతు, విలువైన అనుభూతిని అందిస్తామని వెల్లడించింది. ఎక్కడెడక్క రిమోట్‌ వర్క్‌ అమలు చేయాలన్న దానిపై చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నామని వెల్లడించింది.