వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను అమెరికా వెళ్ళినప్పుడల్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అగ్ర నాయకత్వం తన పట్ల సానుకూలంగానే ఉందని చెప్పుకొచ్చారు.
అమెరికా వెళితే అంతేనా
మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చారు. ఈ అమెరికా పర్యటనపై సొంత పార్టీనాయకులే లేనిపోని ఊహగానాలు ప్రచారం చేశారని కృష్ణ ప్రసాద్ అంటున్నారు. వారందరికి కూడా తానే స్వయంగా పార్టీలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టానని అన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే ఇలాంటి పోకడలు ఉన్నాయని వాపోయారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తన నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తీసుకుంటున్నారని, తన పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సానుకూలంగానే ఉన్నారని ఆయన వివరించారు.
సైలెంట్‌గా ఉంటా అలా అని కాంప్రమైజ్ కాను...
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు రాజకీయాన్ని మరోమారు వేడెక్కించాయి. మైలవరంలో అసంతృప్తవాదులపై శాసన సభ్యుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 175 మంది శాసన సభ్యుల్లో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను కూడా ఉన్నానని తెలిపారు. తాను సౌమ్యంగా ఉన్నంత మాత్రాన కాంప్రమైజ్ అయినట్టు కాదన్నారు. అలాంటి పరిస్థితే రాదని స్పష్టం చేశారు.
భయపెట్టో బెదిరించో లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు వసంత కృష్ణప్రసాద్. పదవులు ఇచ్చే దాకా నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా అంటూ వసంత వ్యాఖ్యలు చేశారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని శాసన సభ్యుడు వసంత మండిపడ్డారు. ఇలాంటి వాటిని లెక్క చేసేది లేదన్నారు.
ఎన్నికల సమయంలో...
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఈ టైంలో సొంత పార్టీలో ఉన్న నాయకులను కేంద్రంగా చేసుకొని శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేయటంపై సర్వత్రా చర్చనీయాశంగా మారింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు కేటాయింపులు చేశామని, అయితే ఇప్పుడు వారే తిరిగి విమర్శించటం వెనుక ఉన్న అంతర్యం ఏంటని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం తనకు అండగా ఉందన చెప్పటం ద్వార వారందరికి వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారని పార్టీలో టాక్ నడుస్తోంది.
Also Read:తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం- ఏపీలో మాత్రం అయిదేళ్ల కనిష్ఠానికి తగ్గుదల
Also Read: నీళ్లు లేవు, జాగ్రత్తగా వాడుకోండి- తెలుగు రాష్ట్రాలకు కృష్ణాబోర్డు సూచన