Cultivation area in Telangana and Andhra Pradesh: తెలంగాణలో నీటి పారుదల సౌకర్యం పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే తెలంగాణలోనే వరి సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. పంటల ఉత్పత్తి కూడా అధికమవుతోంది. వరి, నూనె గింజల సాగు కూడా పెరిగింది.  గతంతో పోలిస్తే రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్లు పెరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పంటల సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే తగ్గిపోయింది. ఏకంగా 7.01 లక్షల కేంద్ర వ్యవసాయ శాఖ హెక్టార్ల మేర తగ్గిపోయింది. కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఈ నెల 18వ తేదీ వరకు సేకరించిన గణాంకాలను వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. 


తెలంగాణలో..


తెలంగాణలో ఈ వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో రెండు పంటల సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వరి, నూనెగింజల సాగు రెండేళ్ల కంటే ఈ ఏడాది పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి 4.42 లక్షల హెక్టార్లు, నూనెగింజలు 0.23 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు వెల్లడించారు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, చెరకు,  పత్తి సాగు కాస్త తగ్గింది.


దేశ వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా.. అందులో 30 % వాటా తెలంగాణదే. ఇందులో తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పప్పు దినుసుల సాగు 0.37, చిరుధాన్యాలు 0.01, చెరకు 0.08,పత్తి 1.46 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. పప్పు దినుసుల సాగు అయిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. కంది, మినుములు, పెసల సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. చిరుధాన్యాల సాగు గత రెండేళ్ల కంటే తగ్గింది. చెరకు సాగు గత ఏడాది కంటే తగ్గింది. పత్తి గత మూడేళ్ల కంటే తగ్గింది. మొక్కజొన్న పరిస్థితి గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా ఉంది.


ఆంధ్ర ప్రదేశ్‌లో..


ఏపీలోసాగు విస్తీర్ణం గతం కన్నా తగ్గింది. ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్‌)లో పంటల సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే 7.01 లక్షల హెక్టార్ల మేర తగ్గిపోయింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 1.53 లక్షల హెక్టార్లు తగ్గింది. పప్పు దినుసులు 0.45, చిరుధాన్యాలు 0,17 , నూనె గింజలు 2.66, చెరకు 0.10, పత్తి 2.10 లక్షల హెక్టార్ల మేర తగ్గినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో వరి విస్తీర్ణం అయిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఏకంగా 2.72 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అదే విధంగా కంది 0.52, మినుములు 0.08, పెసలు 0.07, నూనె గింజలు 2.42, వేరు సెనగ 2.38, నువ్వులు 0.11, పత్తి 1.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణం తగ్గిపోయింది. పొద్దుతిరుగుడు విస్తీర్ణం గత రెండేళ్ల కంటే 0.04 లక్షల హెక్డార్లు పడిపోయింది. ఆముదం సాగు మాత్రం సాధారణం కంటే కాస్త పెరిగింది.