Dinesh Karthik: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియా రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని దినేశ్ కార్తీక్‌ (Dinesh Karthik) అంటున్నాడు. అవి రెండూ అత్యంత కఠిన ప్రశ్నలని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సేనలో నాలుగో పేసర్‌ ఎవరని ప్రశ్నించాడు. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలో ఎవరు ఎవరికి బ్యాకప్‌ అని అడిగాడు. ఆసియాకప్‌ 2023కి టీమ్‌ఇండియాను ఎంపిక చేశాక అతడు మాట్లాడాడు.


'ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా రెండు అంశాలపై దృష్టి సారించాలి. మొదటిది నాలుగో మీడియం పేసర్‌ ఎవరన్నది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనకు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌ ప్రధాన పేసర్లు. ఈ ముగ్గురిపై మనకెలాంటి అనుమానాలు లేవు. అయితే నాలుగో పేసర్‌ ఎవరన్నదే సమస్య. శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్ కుమార్‌లో ఎవరుంటారు? లేదా అత్యంత వేగంగా బౌలింగ్‌ చేసే ఉమ్రాన్‌ మాలిక్‌ను తీసుకుంటారా?' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.


సెలక్టర్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకున్నారు. ఈ ముగ్గురూ మిడిలార్డర్లో కీలకం అవుతారు. అయితే తిలక్‌ వర్మను తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 'మనకు లెఫ్ట్‌ హ్యాండర్‌ అవసరం ఉందా? మనం తిలక్‌ వర్మను చూడాలా లేదంటే అన్ని వైపులా స్వీప్‌ చేసే సూర్యకుమార్‌ను చూడాలా? ఎందుకంటే అతడు 360 డిగ్రీల్లో బాదేస్తాడు. స్పిన్నర్లపై దూకుడుగా ఆడతాడు. బ్యాకప్‌ బ్యాటర్‌ ఎవరన్నదే అసలు ప్రశ్న. నా వరకైతే టీమ్‌ఇండియా ఈ ఆసియాకప్‌లో ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి' అని డీకే వెల్లడించాడు.


ఆసియాకప్‌కు వికెట్‌ కీపర్‌ ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా రెండేళ్ల నుంచి కేఎల్‌ రాహుల్‌ను వన్డేల్లో కీపింగ్‌ చేయిస్తున్నారు.  అతడూ అంచనాలను అందుకున్నాడు. చక్కగా కీపింగ్‌ చేశాడు. అలాగే మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాడు. ఐదో స్థానంలో వచ్చిన మ్యాచ్‌ విన్నింగ్స్‌ ఇన్నింగ్సులు ఆడాడు. అయితే సెలక్టర్లు ఇషాన్‌ కిషన్‌ను రెండో కీపర్‌గా ఎంచుకున్నారు. సంజూ శాంసన్‌ను రిజర్వుగా తీసుకున్నారు. రాహుల్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడమే ఇందుకు కారణం.


ఆసియాకప్‌ 2023కి టీమ్‌ఇండియాను సోమవారం ఎంపిక చేశారు. రిజర్వు ఆటగాడితో కలిపి 18 మంది పేర్లను ప్రకటించారు. గాయాలతో సుదీర్ఘ కాలం దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీలో పునరాగమనం చేస్తున్నారు. హైదరాబాదీ యువకెరటం, టీ20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న తిలక్‌ వర్మకు చోటు దక్కింది. అతడు వన్డేల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఫాస్టు బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ టోర్నీకి ఎంపికయ్యారు.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌


Also Read: టీమ్‌ఇండియాకు అన్నీ ఎక్కువే.. అదే అసలు సమస్య! దాదా కామెంట్స్‌!