Himachal Pradesh Floods:
74 మంది మృతి..
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకి భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వరదల కారణంగా 74 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది. షిమ్లా ప్రాంతంపై ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 74 మంది మృతుల్లో 21 మంది షిమ్లాకి చెందిన వాళ్లే. ఇక్కడే కొండ చరియలు విరిగి పడిన ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. మరో 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. దాదాపు మూడు రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సమ్మర్ హిల్ ప్రాంతంలో 14 మృత దేహాలను గుర్తించారు. ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంది వందలాది మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత మూడు రోజుల్లోనే 2074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బ తిన్నాయన్న ఆయన వీటిని పునరుద్ధరించేందుకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాసముందని చెప్పారు. ఇప్పటి వరకూ ఈ వరదల కారణంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోట్ల రూపాయల నష్టం..
గత 55 రోజుల్లో 113 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు నమోదయ్యాయి. పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ (PWD)కి రూ.2,491 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. అటు రైల్వే ట్రాక్‌లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ విరిగిపోయాయి. మరి కొద్ది రోజుల పాటు షిమ్లా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే IMD హెచ్చరించింది. 54 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో 742 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా...ఇక్కడ 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ సారి ఆ రికార్డు అధిగమించింది. ఈ జులైలో 50 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టి వర్షపాతం నమోదైంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ చెప్పిన వివరాల ప్రకారం...జూన్ 24న హిమాచల్‌లో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ 214 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ఓ రిసార్ట్‌లో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పౌరి కోట్‌ద్వార్ దుగ్గాడ నేషనల్ హైవే బ్లాక్ అయింది. రిషికేశ్ బద్రినాథ్ హైవే కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా పంజాబ్‌లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్‌లో డ్యామ్‌లు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
Also Read: పర్యావరణ పరిరక్షణలో భారత్ ముందడుగు, ఐక్యరాజ్య సమితిలో మిషన్ లైఫ్ ఎగ్జిబిషన్