Heat Wave Alert In India: ఈ వేసవి చాలా హాట్‌ గురూ అంటోంది భారత్ వాతావరణ శాఖ. ఈ వేడి కారణంగా భారత్‌లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులను చూడాల్సి వస్తోందని హెచ్చరిస్తోంది. పంటలు దెబ్బతింటాయని, విద్యుత్‌ సంక్షోభం కూడా చూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తోంది. 


మే 31తో ముగిసే మూడు నెలల్లో చాలా ప్రాంతాల్లో వేడి గాలులు భయభ్రాంతులకు కారణం కాగలవని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఎస్.సి.భాన్ తెలిపారు. 


 హాట్ వెదర్ కారణంగా ఇప్పటికే సమస్యలు మొదలయ్యాయి. విద్యుత్ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. పంటలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. గోధుమ పంటపై ప్రభావాన్ని పర్యవేక్షించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


ఈసారి హాట్‌ వెదర్‌ గత రికార్డులను అధిగమించబోతుందోని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంలో మార్చిలో మాత్రమే అత్యంత ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఒక శతాబ్దంలోనే అత్యంత హాట్ మార్చిగా రికార్డుల్లోకి ఎక్కింది. 


మార్చిలో మొదలైన హీట్‌ వేవ్స్ ధాటికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పంటలు ఎండిపోవడం, విద్యుత్ కొరత ఏర్పడటంతో ముందస్తు చర్యలు చేపట్టింది. ఎగుమతులను అరికట్టింది. విద్యుత్ సంక్షోభం ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంది. 


వాతావరణ శాఖ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 1901 నుంచి ఫిబ్రవరిలో అత్యధికంగా ఉన్నాయి. మార్చిలో ఉష్ణోగ్రతలు ద్వీపకల్ప ప్రాంతం మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


ఈ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు దేశంలో వివిధ పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా గోధుమ ఉత్పత్తిని దెబ్బ తీయనుంది. రెండో ఏడాది కూడా పంటకు ముప్పు పొంచి ఉంది. ఫలితంగా ఆహార కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గోధమ దిగుబడిలో చైనా తర్వాత భారతదేశం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. తక్కువ దిగుబడి ఎగుమతి నియంత్రణకు దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా ప్రపంచ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. 


తీవ్రమైన వాతావరణం


వాతావరణ మార్పులు ఎక్కువ ఎఫెక్ట్ పడుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. హీట్‌వేవ్స్‌, భారీ వరదలు, తీవ్రమైన కరవు వంటి వాతావరణ పరిస్థితులు ఇండియాపై చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల మందిని బలి తీసుకుంటున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తున్నాయి. దీని వల్ల ఆర్థిక కష్టనష్టాలు పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా శిలాజ ఇంధనాల డిమాండ్‌ పెరుగుతోంది. జలవిద్యుత్ వనరులు పూర్తిగా అడుగంటే పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల దేశ ఇంధన సరఫరాలపై పెను భారం పడుతుంది.


దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్లు వేసవిలో మూడు నెలలపాటు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, బ్లాక్‌అవుట్‌లను నివారించడానికి, దేశీయ సరఫరాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఎయిర్ కండిషనర్లు, నీటిపారుదల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి జనరేటర్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.


దేశంలో 2015 నుంచి చూస్తే హీట్‌ వేవ్స్‌ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య 2020 నాటికి రెండింతలు పెరిగింది. దేశంలో వేసవిలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని  హీట్ వేవ్‌గా చెబుతారు.