worms served in sandwiches by IndiGo: న్యూఢిల్లీ: కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇండిగో ఎయిర్ లైన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇండిగో విమానంలో సర్వ్ చేసిన శాండ్‌విచ్‌లలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు రావడంపై వైద్య శాఖ అధికారులు స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదు అందడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు బుధవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాణ్యత లేని ఆహార పదార్థాలు విమానంలో సప్లై చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 29న ఢిల్లీ నుండి ముంబై విమానంలో ఓ ప్యాసింజర్ కు ఇండిగో విమానంలో సర్వ్ చేసిన శాండ్ విచ్‌లో పురుగులు వచ్చాయని తెలిసిందే. దీనిపై ఆ ప్యాసింజర్ చేయగా కేంద్ర వైద్యశాఖ స్పందించింది.


 






అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన కుష్బూ గుప్తా, డైటీషియన్. మైండ్‌ఫుల్ ఈటింగ్ కోచ్ గా పనిచేస్తున్నారు. ఆమె డిసెంబర్ 29న ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆరోజు కుష్బూ గుప్తా ఢిల్లీలో ఇండిగో విమానం ఎక్కారు. తాను తెల్లవారుజామున ప్రయాణం చేయాల్సి ఉందని, టికెట్ బుకింగ్ సమయంలో వెజ్ శాండ్‌విచ్ ను సైతం ఆర్డర్ చేసుకున్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఇండిగో సిబ్బంది ఆమెకు ఆర్డర్ చేసుకున్న వెజ్ శాండ్‌‌విచ్ ను సర్వ్ చేశారు. 


పురుగులు చూసి ప్రయాణికురాలు షాక్
ప్యాసింజర్ కుష్బూ గుప్తా శాండ్ విచ్ తీసుకుని తినాలని చూడగా కనిపించిన సీన్ చూసి షాకైంది. శాండ్ విచ్ మీద పురుగు పాకడం గమనించింది. ఫ్లైట్ అటెండెంట్‌కి  ఈ విషయం చెప్పగా వారు అంతగా పట్టించుకోలేదట. కనీసం వేరే వాళ్లకు ఇలాంటి పరిస్థిత రాకూడదని డైటీషియన్ గా తాను అలర్ట్ చేసినా ఇండిగో సిబ్బంది ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేదు. ఇదే విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆమె వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తాను ఎదుర్కొన్న పరిస్థితితో పాటు ఇండిగోలో క్వాలిటీ లేని శాండ్ విచ్, ఇతర ఫుడ్ సప్లై చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు శాండ్ విచ్‌లో పురుగులు రావడంపై ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నోటీసులు జారీ చేశారు. వివరణ తరువాత చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.