UGC-NET DEC2023: యూజీసీ నెట్-2023 (డిసెంబరు) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ (UGC NET Answer Key)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీతోపాటు యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 ఫలితాలను జనవరి 10న వెలువడనున్నాయి.
UGC NET December-2023 Answer Key and Objections
దేశంలోని ప్రధాన నగరాల్లో డిసెంబర్ 6 నుంచి 19 వరకు పలు కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అభ్యర్థుల ఎంపికలోనూ కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించనున్నారు. ఇందుకోసం పలు స్లాట్లలో నిర్వహించనున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతారు.
నెట్‌తో ప్రయోజనాలెన్నో..
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం-అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు రూ.67 వేలు బేసిక్ పే చెల్లించాలని ∙యూజీసీ నిర్దేశించింది.
➥ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో రెండేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత మరో రెండేళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది.
➥ జేఆర్‌ఎఫ్ హోదాలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేల ఫెలోషిప్ అందుతుంది.
➥ జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
➥ జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్నవారు సైంటిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
➥ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
➥ ఆర్ట్స్,హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.