Politics of Telugu Desam : విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అన్న సీటుకు తమ్ముడు పోటీ కావడంతో ఆయా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏ సమావేశం నిర్వహించినా రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. తాజాగా తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ నెల 7న చంద్రబాబు (Chandrababu) తిరువూరులో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీల్లో కేశినేని ( Kesineni Nani ) ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. కేశినేని చిన్నినీ సమావేశానికి రానివ్వమంటూ గేటు వద్ద కేశినేని నాని వర్గం ఆందోళనకు దిగింది. తిరువూరు టీడీపీ ఇంచార్జి దత్తుపై నాని వర్గం దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇంఛార్జ్ దత్తుపై కూడా నాని వర్గం ఆందోళనకు దిగింది. కొద్దిసేపటికి వేలాదిమందితో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూంలో ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు.
నాని వర్గీయులు ఫ్లెక్సీలు చించేయగా.. అందులో జనసేన అధినేత పవన్ ఫొటో ఉందంటూ జనసైనికులు నిరసనకు దిగారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ దశలో జోక్యం చేసుకున్న పోలీసులు, ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండటంతో.. ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా.. సమావేశానికి వెళ్లకముందే పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. తిరువూరులో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ పతాక స్థాయికి చేరింది. నాని, చిన్ని వర్గాల మధ్య కుర్చీలు విసురుకోడంతో ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్ళారు.
విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేనికి ఈసారి చంద్రబాబు అవకాశం ఇవ్వడంలేదని.. ఆయన తమ్ముడు చిన్నిని ఆ స్థానంలో పోటీ చేయించబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరి బ్రదర్స్ మధ్య రాజకీయ చిచ్చు చెలరేగింది. ఇది కాస్త వర్గ విభేదాలుగా మారాయి. అన్న కేశినేని పేరు చెబితే తమ్ముడు చిన్ని వర్గానికి నచ్చడం లేదు. తమ్ముడు చిన్ని పేరు వింటేనే అన్న నాని వర్గం మండిపోతోంది. దీంతో సమావేశాలు, కార్యక్రమాల్లో రెండు వర్గాలు పరస్పరం దూషించుకుంటున్నాయి. దాడులు చేసుకుంటున్నాయి.