Pawan Kalyan invites for Ayodhya Ram Mandir Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆహ్వానం అందింది. ఈ మేరకు పవన్‌కు ఆర్ఎస్ఎస్ (RSS) ఇవాళ ఆహ్వాన పత్రిక అందజేసింది. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి శ్రీనివాస రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ కలిశారు. అయోధ్య రామమందిర ప్రారంభానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు.
రాజకీయ పార్టీల నేతలందరికీ ఆహ్వానాలు
ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను పవన్‌కు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశంలోని రాజకీయ పార్టీల నేతలందరికీ ఆహ్వానాలు అందిస్తున్నారు. రాజకీయ విబేధాలను పక్కన పెట్టి అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అనేకమంది భారీగా విరాళాలు అందించారు. పవన్ కూడా ఆలయ నిర్మాణం కోసం రూ.30 లక్షలు విరాళం ఇచ్చారు. గతంలో తిరుపతిలో స్వయంగా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులకు చెక్కును అందించారు. అంతేకాకుండా అందరూ విరాళం అందించాలని పవన్ పిలుపునిచ్చారు. రాముడు అందరి దేవుడని, కులామతాలకు అతీతంగా విరాళాలు ఇవ్వాలని జనసేన నేతలు, కార్యకర్తలు సూచించారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
పవన్ వెళ్తారా? లేదా?
రామమందిర ప్రారంభోత్సవానికి పవన్‌ను స్వయంగా కలిసి ఆర్ఎస్ఎస్ నేతలు ఆహ్వానించారు. దీంతో పవన్ వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు దైవభక్తి చాలా ఎక్కువ. పూజలు, యాగాలు, దీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే గోవులను పూజిస్తూ ఉంటారు. అన్ని మతాలను పవన్ గౌరవిస్తూ ఉంటారు. దీంతో పవన్ అయోధ్యలో రామమందిరం ప్రారంభాని (inauguration of Ayodhya Ram Mandir)కి వెళ్లే అవకాశముంది. ఈ నెల 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది రాముడి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజలందరూ రావాల్సిందిగా ఇప్పటికే ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. అందుకు తగ్గట్లు భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
జనవరి 22న అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ట
22వ తేదీన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్టించనున్నారు. కర్ణాటకకు చెందిన యోగిరాజ్ అరుణ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని ఆ రోజున ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీతో సహా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది అతిథులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వాన కార్డును కూడా అద్బుతంగా తయారుచేయించారు. ఆలయం నిర్మాణం ఎలా జరిగింది? ఎప్పుడేం జరిగాయి? అనే వివరాలను పొందుపర్చారు. శ్రీరాముడు తన జన్మస్థలంలోని ఆలయానికి తిరిగి వచ్చిన సందర్భంగా శుభప్రదమైన వేడుక అంటూ కార్డు తొలి పేజీలో రాసి ఉంది. ప్రధాని మోదీతో పాటు దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. సినీ ప్రముఖులను కూడా శ్రీరాం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ ను ఆహ్వానించారు.