Haryana Women Attack On Gangsters: కొడుకు కోసం ఓ తల్లి ఏకంగా తుపాకీకే ఎదురెళ్లింది. తన కొడుకును హతమార్చేందుకు వచ్చిన గ్యాంగ్‌పై బూజు దులిపే కర్ర (Broom Stick)తో ఎదురుదాడికి దిగింది. కొడుకు కోసం ఆ తల్లి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దుండుగులను వెంబడించింది. హర్యానాలోని బివానీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రియల్ లైఫ్ స్టోరీ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
హర్యానా (Haryana)లోని బివానీ పట్టణం దర్బార్ కాలనీలో సోమవారం ఉదయం తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. హరికిషన్ అలియాస్ హరి హరియ అనే వ్యక్తి సోమవారం ఉదయం అతడు రోడ్డుపై నిలుచుని ఉన్నాడు. ఆ సమయంలో రెండు బైకులపై నలుగురు సభ్యుల ముఠా (Gangsters) అక్కడికి చేరుకుంది. వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు సభ్యులు క్షణాల్లో కిందకు దిగి హరికిషన్‌పై కాల్పులు జరిపారు.
దీన్ని వెంటనే గ్రహించిన హరికిషన్ ఒక ఇంట్లోకి పారిపోయాడు. అయితే దుండగులు అతన్ని వెంబడించారు. తుపాకులతో కాల్పులు కొనసాగించారు. ఇంతలో ఓ మహిళ బూజు దులిపే కర్రతో దుండగులపై విరుచుకుపడింది. ఈ ఘటనతో అవాక్కయిన ఆ ఇద్దరు దుండగులు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మహిళపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళా శక్తి ముందు ఈ శక్తి పనిచేయదని కొనియాడుతున్నారు.
ప్రాణాలకు తెగించి ఆమె ముందుకు రాకపోయి ఉంటే హరికిషన్ తుపాకీ గుళ్లకు బలయ్యే వాడని అభినందనలు వెల్లువత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన హరికిషన్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దుండుగులను వెంబడించిన మహిళ శకుంతలగా గుర్తించారు. బాధితుడు హరికిషన్ శకుంతల కుమారుడిగా నిర్ధారించారు.
అదిరిపోయే ట్విస్ట్
బాక్సర్ రవి హత్య కేసులో హరికిషన్ కీలక నిందితుడుగా ఉన్నాడు. ఇటీవలే బెయిలుపై జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై దాడి జరిగింది. ఘటనపై శకుంతల స్పందించారు. తాను పశువుల పాక శుభ్రం చేసుకుంటుండగా టపాసులు పేల్చిన శబ్ధం వచ్చిందని, అవి ఏంటో చూడడానికి బయటకు వచ్చినట్లు చెప్పారు. తన కుమారుడిపై ఇద్దరు తుపాకులతో దాడి చేస్తున్నారని, దానిని ఆపడానికి బూజు కర్రతో దుండగులపై ఎదురు దాడి చేసినట్లు తెలిపారు. తన స్థానంలో ఎవరు ఉన్నా.. వాళ్ల బిడ్డను కాపాడుకోవడానికి ఇలాగే చేసేవారని అన్నారు.
శంకుతల చేసిన పని నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆమె ధైర్య సాహసాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి ప్రాణాలను కూడా లెక్క చేయదని కామెంట్లు చేస్తున్నారు.