Uttarakhand Tunnel Collapse: ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ- పిల్లలకు చెప్పాల్సిన ధైర్య సాహసాల కథే 'ఆపరేషన్ సిల్కీయారా'

Uttarakhand Tunnel Rescue Operation: ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కూలీలు ఎట్టకేలకు బయటపడ్డారు. కార్మికులు బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Continues below advertisement

Uttarakhand Tunnel Collapse: ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ... ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ... విశ్రమించవద్దు ఏ క్షణం... విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ విజయం నిర్ణయంరా.... ఇది ఓ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన లిరిక్స్. ఇప్పుడు ఈ పదాలు అచ్చుగుద్దినట్టు ఉత్తరాంఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న వారికి, బయటకు తీసిన సిబ్బందికి సరిపోతాయి.  

Continues below advertisement

'ఓటమిని అంగీకరించనంత వరకు విజయానికి అవకాశం ఉండే ఉంటుందని ఊరికే అలేదు పెద్దలు. ఉత్తరాఖండ్ సొరంగంలో 41 మంది కూలీలు 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా కచ్చితంగా వెలుగుల ప్రపంచం చూస్తామన్న ఆశతో బతికారు. చివరకు వారి ఆశలు నిజమయ్యాయి. మంగళవారం (నవంబర్ 28) కార్మికులందరినీ సురక్షితంగా సొరంగం నుంచి బయటకు తీశారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్కియారా వద్ద సొరంగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 41మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన మంగళవారం (నవంబర్ 28) బయటకు వచ్చారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వంటి వివిధ ఏజెన్సీలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. 

రెస్క్యూ టీంను అభినందించిన ప్రధాని మోదీ

రాత్రి 7.56 గంటలకు సొరంగం నుంచి మొదటి కార్మికుడు బయటకు వచ్చాడని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అనంతరం కార్మికులందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. సిల్కియారా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో రెస్క్యూ సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వారి ధైర్యసాహసాలు మా కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి అన్నారు. 

నవంబర్ 12న దీపావళి రోజున ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలోని బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై సిల్కియారా-దండల్ గావ్ సొరంగంలో కొండచరియలు విరిగిపడి 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మరుసటి రోజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

హారిజాంటల్ డ్రిల్లింగ్ ప్రారంభం
రెస్క్యూ ఆపరేషన్ తొలి దశలో నవంబర్ 14 నుంచి హారిజాంటల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఇందుకోసం ఆగర్ యంత్రం సహాయం తీసుకుని దాని ద్వారా సొరంగం తవ్వి అందులో 800-900 ఎంఎం స్టీల్ పైపు బిగించారు. అయితే శిథిలాల కిందపడి ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ఇది ప్రమాదమని గ్రహించి దాన్ని ఆపేశారు. ఆక్సిజన్ సరఫరా చేస్తున్న పైపు ద్వారానే కార్మికులకు ఆహారం, నీరు, మందులు సరఫరా చేశారు.

ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన డ్రిల్లింగ్ యంత్రం
రెస్క్యూ ఆపరేషన్ మొదలైన తొలినాళ్లలో పెద్దగా ఆశలు లేవు. డ్రిల్లింగ్ మెషీన్ వల్ల కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న 'ఎన్‌హెచ్ఐడీసీఎల్' అధునాతన యంత్రాన్ని ఆర్డర్ చేసింది. సమయం తక్కువగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ చేసి తరలించారు. నవంబర్ 16న కొత్త డ్రిల్లింగ్ యంత్రాన్ని అసెంబుల్ చేసి అమర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

కాపాడేందుకు ఐదు ప్రణాళికలు సిద్ధం
కొత్త ఆగర్ యంత్రం నుంచి కేవలం 24 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే చేయగా అది కూడా పని చేయలేదు. దీని తరువాత, ఇండోర్ నుంచి కొత్త ఆగర్ యంత్రాన్ని డెలివరీ చేశారు. ఆ తర్వాత నవంబర్ 17న సొరంగం లోపల పగుళ్లు కనిపించడంతో ఆపరేషన్ నిలిపివేయాల్సి వచ్చింది. మరుసటి రోజు వర్టికల్ డ్రిల్లింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులతో సహా ఐదు ప్రణాళికలు సిద్ధం చేశారు.

వర్టికల్ డ్రిల్లింగ్‌కు మొగ్గు చూపారు. ప్రధాని మోదీ సీఎం ధామితో మాట్లాడి కార్మికుల మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. నవంబర్ 21న తొలిసారి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వీడియో బయటకు వచ్చింది. అదే రోజు బాల్కోట్ ప్రాంతం నుంచి సొరంగంలో డ్రిల్లింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరుసటి రోజు 45 మీటర్ల వరకు సమాంతర డ్రిల్లింగ్ జరిగింది. అప్పుడు 12 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. 
నవంబర్ 23న ఆగర్ యంత్రం పాడైపోయింది.

దీన్ని అధిగమించి రెస్క్యూ ఆపరేషన్ పుఃప్రారంభించారు. అధికారులు 48 మీటర్ల వరకు సొరంగం తవ్వాక పగుళ్లు వచ్చాయి. తాత్కాలికంగా ఆపరేషన్ ఆపేశారు. మరుసటి రోజు మళ్లీ ఆపరేషన్ ప్రారంభమైంది, కానీ ఈసారి ఆగర్ యంత్రంలో మరో సమస్య వచ్చింది. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ ఆగర్ యంత్రం పాడైపోయిందని, ఇకపై దానిని ఉపయోగించలేమని చెప్పారు.

కార్మికులకు సాయం అందగానే..
సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు నవంబర్ 27 నుంచి ఊపందుకున్నాయి. వాస్తవానికి 12 మంది రాట్‌ రెస్క్యూ మైనింగ్ నిపుణుల బృందాన్ని పిలిపించి సొరంగాన్ని మాన్యువల్‌గా తవ్వారు. చివరి 10 నుంచి 12 మీటర్ల తవ్వడమే వీరి పని. మాన్యువల్ డ్రిల్లింగ్ అనంతరం రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి పైపును అమర్చారు. ఇలా వాళ్లు 57 మీటర్ల దూరాన్ని చేరుకున్నారు. తర్వాత కూలీలకు చేరుకున్నారు. 

60 మీటర్ల రెస్క్యూ షాఫ్ట్ నుంచి వీల్డ్ స్ట్రెచర్ లేకుండా స్టీల్ పైపుతో కార్మికులను బయటకు తీశారు. 800 ఎంఎం పైపులతో తయారు చేసిన మార్గం నుంచి కార్మికులను ఒక్కొక్కరుగా బయటకు రప్పించారు. కూలీలను తీసుకొచ్చిన అనంతరం అంబులెన్స్ ద్వారా సిల్కియారాకు 30 కిలోమీటర్ల దూరంలోని చిన్యలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola