Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం (అక్టోబర్ 5, 2024)న పోలింగ్ ప్రారంభమైంది. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. 2,03,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరిలో 8,821 మంది ఓటర్లు 100 ఏళ్లుపైబడిన వారే. రాష్టవ్యాప్తంగా మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హర్యానలోని 90 స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో మహిళా అభ్యర్థులు 101 మంది. 464 మంది స్వతంత్ర అభ్యర్థులు.
ఓటర్లలో 1,07,75,957 మంది పురుషులు, 95,77,926 మంది మహిళలు, 467 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 5,24,514 మంది 18 నుంచి 19 ఏళ్లలోపు ఉండగా, 100 ఏళ్లు పైబడిన వాళ్లు 8,821 మంది ఉన్నారు, వీరిలో 3,283 మంది పురుషులు, 5,538 మంది మహిళలు. 144 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 115 పింక్ పోలింగ్ స్టేషన్‌లు, 87 మంది వికలాంగుల కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాుటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని డిజిపి శత్రుజీత్ కపూర్ తెలిపారు. భద్రత, శాంతి భద్రతల కోసం 30,000 మంది పోలీసులు, 225 పారామిలటరీ కంపెనీలను మోహరించారు. పోల్ బూత్‌లలో 3,460 సమస్యాత్మకంగా ఉన్నట్టు తేల్చారు. 138 మరింత సమస్యాత్మకమైనవిగా పరిగణిస్తున్నారు. 507 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 464 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 32 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశారు.
ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సిఎం నయాబ్ సింగ్ సైనీ కోరారు. "ఈ ప్రజాస్వామ్య వేడుకలో మనమందరం ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100% ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి," అని చెప్పారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024: ప్రముఖ అభ్యర్థులు
ప్రస్తుతం హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, చాలా కాలం తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, INLD-BSP, JJP-ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నప్పటికీ రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రస్తుతం సీఎం నయాబ్ సింగ్ సైనీతోపాటు మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతోపాటు మరో వెయ్యి మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సైనీ (లద్వా), ప్రతిపక్ష నాయకుడు హుడా (గర్హి సంప్లా-కిలోయ్), INLD నుంచి అభయ్ సింగ్ చౌతాలా (ఎల్లినాబాద్), JJP నుంచి దుష్యంత్ చౌతాలా (ఉచన కలాన్), BJP నుంచి అనిల్ విజ్ (అంబలా కాంట్) పోటీ చేస్తున్నారు. కెప్టెన్ అభిమన్యు (నార్నాండ్), OP ధంకర్ (బాడ్లీ), AAP నుంచి అనురాగ్ ధండా (కలయత్), కాంగ్రెస్ నుంచి ఫోగట్ (జులానా) పోటీ చేస్తున్నారు.
బీజేపీ మాజీ ఎంపీ శృతి చౌదరి, అనిరుధ్ చౌదరి ఇద్దరూ బంధువులు తోషమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దేవిలాల్ మనవడు INLD అభ్యర్థి ఆదిత్య దేవి లాల్ దబ్వాలి నుంచి మాజీ ఉప ప్రధాని మనవడు దిగ్విజయ్ సింగ్ చౌతాలా(JJP)తో తలపడుతున్నారు. హిసార్‌లోని అడంపూర్ సెగ్మెంట్ నుంచి మాజీ సీఎం దివంగత భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌ను బీజేపీ పోటీకి దింపింది.
హర్యానా ఎన్నికల ఫలితాలు ఎప్పుడు, ఎక్కడ ఎలా ఫలితాలు చూడాలి?
హర్యానా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8, 2024న విడుదల కానున్నాయి. ఉదయం నుంచే ట్రెండ్ మొదలవుతుంది. ఏ పార్టీ ముందంజలో ఉంది ఎవరు వెనుకబడి ఉన్నారో తెలిసిపోనుంది. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత వస్తుంది. మీరు ABP వెబ్‌సైట్‌లలో, ఏబీపీ సోషల్ మీిడయా ప్లాట్‌ఫారమ్‌లలో (Facebook, X, YouTube మొదలైనవి) ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ పొందవచ్చు. అయితే ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన ఫలితాలు రానున్నాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెలుచుకున్నాయి.
Also Read: చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 38 మంది మావోయిస్టులు హతం!