Vinesh Phogat at Haryana Election 2024 | పారిస్ ఒలింపిక్స్‌ 2024 గాయం తర్వాత దంగల్‌ వదిలి నేరుగా హరియాణ రాజకీయ బరిలోకి దూకిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగట్‌.. తన తొలిపోరులో కెప్టెన్‌ యోగేశ్‌ బైరాగిని ఢీకొట్టనున్నారు. జులానా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచిన వినేశ్‌పై భారతీయ జనతా పార్టీ.. కెప్టెన్ యోగేశ్‌ను నిలిపింది. 21 మందితో కూడిన రెండో లిస్ట్‌ను భాజపా నేడు విడుదల చేసింది. ఇందులో ఇద్దరు ముస్లింలకు ఛాన్స్ ఇచ్చింది. ఫిరోజ్‌పూర్ జిర్కా నుంచి నసీమ్‌ అహ్మద్‌కు అవకాశం కల్పించిన కమలనాథులు.. పునాహనా నుంచి ఐజాజ్‌ ఖాన్‌ను బరిలో నిలిపారు.


హరియాణలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఇప్పటివరకూ 2 లిస్టులు వదిలిన అధికార భాజపా.. 87 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో మూడు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో ఇటీవలే భాజపాలో చేరిన వారికి కూడా అవకాశం కల్పించారు. జననాయక్ జనతా పార్టీకి చెందిన దేవేందర్ సింగ్‌ బబ్లీకి టొహనా సీటు కేటాయించింది. మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ మనవరాలు శృతి చౌదరికి తోషమ్‌ సీటును, కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజీత్ కుమార్తె ఆర్తి సింగ్‌ రావ్‌ అటేలి నుంచి పోటీకి దింపింది. తొలి జాబితాలో హరియాణ ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సహా 67 మంది పేర్లున్నాయి. నాయబ్‌ సింగ్‌ గతంలో కర్నాల్‌ నుంచి గెలవగా ఈ సారి మాత్రం ఆయన.. లాడ్వా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హరియాణ ఎన్నికలు అక్టోబర్ 5న జరగనుండగా.. భాజపా వరుసగా మూడోసారి అధికారం గెలవాలని పావులు కదుపుతోంది. అక్టోబర్ 8న ఎలక్షన్ రిజల్ట్స్ వెల్లడి కానున్నాయి.






రాజకీయబరిలో గెలిచేనా.. ?


వినేశ్‌ రాజకీయాల్లోకి రావడంపై ఆమె పెదనాన్న మహవీర్ ఫొగట్‌ కాసింత అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావడం అనేది వినేశ్ వ్యక్తిగత నిర్ణయమని.. పిల్లలు వారి నిర్ణయాలు వారు తీసుకునే స్వేచ్ఛ ఉందన్న ఆయన.. రాజకీయాలు వదిలి మళ్లీ కుస్తీ బరిలోకి దిగాలని ఆకాంక్షించారు. 2028 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపై వినేశ్ దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 2023లో భాజపా ఎంపీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌ మాజీ ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల మీద చర్యలకు పట్టుపడుతూ తొలిసారి భాజపాకు వ్యతిరేకంగా వినేశ్ గళం విప్పారు. నేరుగా బాధితులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


ఏడాది తర్వాత జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించారు. ఐతే ఆ తర్వాత అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడడంతో .. రెజ్లింగ్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చారు. మరో ఒలింపిక్‌ రెజ్లర్‌ బజరంగ్ పూనియాతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన ఆమె.. జులానా నుంచి బరిలో ఉన్నారు. ఒలింపిక్స్‌ వేళ వినేశ్‌కు సపోర్ట్‌గా నిలిచిన ప్రజలు.. రాజకీయాల్లో మద్దతు తెలుపుతారో లేదో అక్టోబర్ 8న తేలనుంది. ఇప్పటికే ఆమె సోదరి బబితా ఫొగట్‌ భాజపా నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు.