Gyanvapi Kashi Vishwanath Temple : జ్ఞానవాపి వివాదంలో వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archeological Survey of India ) రిపోర్టును బహిరంగపరచాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కాపీలను ఇరువర్గాలకు అందజేయాలని ఏఎస్ఐకి సూచించింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నివేదికను బహిర్గతం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. గతేడాది జూలైలో...వారణాసి కోర్టు జ్ఞానవ్యాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ASIని ఆదేశించింది. 100 రోజుల పాటు వజుఖానా ప్రాంతం మినహా మొత్తం మసీదులో సర్వే నిర్వహించారు. డిసెంబర్ లో ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో సర్వే చేసింది. ఏఎస్ఐ 1500 పేజీల సర్వే రిపోర్టును రెండు వర్గాలు త్వరలో అందజేయనుంది.
ఆలయంపై మసీదు నిర్మాణం జరిగిందా ?
జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ మందిరం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. హిందూ సంఘాల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపించారు. జ్ఞానవాపి వివాదంపై ఇరు వైపుల వాదనలను విన్నన్యాయస్థానం...రెండు వర్గాలకు ఈ-మెయిల్ ద్వారా రిపోర్టు పంపాలని ఆదేశించింది. అయితే ఈ మెయిల్ ద్వారా కాకుండా హార్డ్ కాపీలను అందజేస్తామని ఏఎస్‌ఐ తెలిపింది. కొన్ని వారాల క్రితం జ్ఞానవాపి మసీదు ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేయాలని హిందూ మహిళలు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు ఆమోదించింది. ఇది ఒకప్పుడు కాశీ విశ్వనాధ మందిరంలో భాగమని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ముస్లిం సంఘాలు మాత్రం మసీదు ఉన్నట్లు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో నిర్మించిన మసీదు...గతంలో ఉన్న ఆలయంపై నిర్మించారంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ASI సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా సర్వే నివేదికలను రెండు వర్గాలకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేవాలయం ఉండేదన్న హిందూ సంఘాలు
ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని హిందూ వర్గాలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ మసీదులో ఉన్నాయని, మళ్లీ ఆ ప్రదేశంలో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అనుమతించాలని పిటిషన్ లో కోరారు. 1991 ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం.. ఆ పిటిషన్ విచారణార్హం కాదని, హిందువులు వేసిన పిటిషన్ ను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ, ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. హిందూ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని తెలియజేసింది. ఈ పిటిషన్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదని, దేశ విశాల ప్రయోజనాలకు సంబంధించినదని వ్యాఖ్యానించింది.