West Bengal CM Mamata Banerjee got an injury: కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి (Road Accident) గురికాగా, మమతా బెనర్జీ తలకు గాయాలైనట్లు సమాచారం. బుర్ధ్వాన్ లో కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతా తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి మరో కారు అడ్డు రావడంతో ఒక్కసారిగా సీఎం మమతా కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మమతా బెనర్జీ తల (నుదురు)కు గాయమైనట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి మమతా హెలికాఫ్టర్ లో కోల్‌కత్తాకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారని, మార్గం మధ్యలో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
సీఎం మమతా బెనర్జీ తూర్పు బుర్ధ్వాన్ లో బుధవారం మధ్యాహ్నం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం అనంతరం టీఎంసీ అధినేత్రి హెలికాప్టర్ లో కోల్‌కతాకు బయలుదేరాలి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన బుర్ధ్వాన్ నుంచి రాజధాని కోల్‌కత్తాకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో ముందు వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించడం లేదని, దగ్గరకు వస్తున్నప్పుడు వాహనాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ సడన్ బ్రేకులు వేశాడు. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న మమతా బెనర్జీ తల విండ్ షీల్డ్‌కు గట్టిగా తగలడంతో ఆమె తలకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స నిర్వహించి, మరో వాహనంలో కోల్‌కత్తాకు తరలిస్తున్నారు.
కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ షాక్!
దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని బెనర్జీ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో లేదా ఇతర నేతలతో ఇప్పటివరకూ ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. టీఎంసీ ఇచ్చిన ప్రతిపాదనను వారు తిరస్కరించారని.. దాంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. దాంతో I.N.D.I.A కూటమి నుంచి మమతా బెనర్జీ వైదొలిగారని రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు తనకు తెలపలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఎంసీ నేతలు కొందరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు రెండు లోక్ సభ సీట్లు కేటాయిస్తామని టీఎంసీ నాయకత్వం చెబుతుండగా, కాంగ్రెస్ అధిష్టానం 6 సీట్లలో ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.