రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ చోట కాంగ్రెస్ మరో చోట బీజేపీ గెలిచింది. అధికారం ఉన్న చోట తిరిగి ఓ చోట గెలిస్తే మరొకచోట బీజేపీ ఓడిపోవడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లోని తీర్పు జాతీయపార్టీలకి ఏం చెబుతున్నాయి? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ?
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తిరిగి గుజరాత్ ని బీజేపీనే దక్కించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీ మెజార్టీతో కాషాయం గెలుపునందుకోవడం విశేషం. అంతేకాదు పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్ట్ ల పేరు మీదున్న రికార్డ్ ని బీజేపీ ఈ గెలుపుతో బద్ధలుకొట్టింది. వరసగా 7సారి కూడా గుజరాత్ లో కమలానికే ప్రజలు పట్టం కట్టడంతో ఓకేసారి రెండు రికార్డ్ లను బీజేపీ నెలకొల్పినట్లైంది. 2002లో 127 సీట్లని అందుకున్న బీజేపీ 20ఏళ్ల తర్వాత ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తూ 150కిపైగా సీట్లను సాధించి ప్రతిపక్షం లేకుండా చేసింది.
మోదీ బొమ్మతోనే గుజరాత్ గెలిచిందా? !
దాదాపు 30ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఆ హోదాని కూడా కోల్పోయింది. గత ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఉన్న హస్తంపార్టీ ఈసారి కనిపించకుండా పోయింది. ఆప్, ఎంఐఎం పార్టీల ప్రభావం బీజేపీ కన్నా కాంగ్రెస్ కే తీవ్ర నష్టం కలిగించింది. దీనికి తోడు కాంగ్రెస్ పెద్దలు కూడా గుజరాత్ ఎన్నికలపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ఈసారి ప్రతిపక్షహోదాని కూడా నిలుపుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు బీజేపీ సంబరాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లో తిరిగి బీజేపీనే వస్తుందన్నది ఆ పార్టీకి తెలుసు. కానీ గతంలో కన్నా ఈసారి బాగా కష్టపడాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రధాని మోదీ బ్రాండ్ తోనే బీజేపీకి గుజరాత్ లో విజయం దక్కింది కానీ ఓ పార్టీగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే కనక ఈ భారీ మెజార్టీ దక్కేది కాదని చెబుతున్నారు.
ఆప్ కి స్టార్ అప్...
ఢిల్లీని మాత్రమే కాదు పంజాబ్ లో తిరుగులేని అధికారాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీపార్టీ ఎప్పుడైతే గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చెప్పిందో అప్పటి నుంచే కాషాయంలో కలవరం మొదలైంది. దాదాపు 30ఏళ్లుగా బీజేపీ పాలన చూసి విసిగిన గుజరాతీయులు ఈసారి మార్పు కోరుకుంటున్నారన్నది ఆపార్టీ గ్రహించింది. అందుకే ఎన్నికలకు ముందే మోదీ-అమిత్ షాలు రంగంలోకి దిగడం, బలహీనంగా , పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. ఫలితంగానే ఇప్పుడు బీజేపీ భారీ మెజార్టీని అందుకుందని చెబుతున్నారు. భవిష్యత్ లో బీజేపీ ఈ గెలుపుని బలుపుగా తీసుకుంటే మాత్రం ఆప్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందని జోస్యం చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు. ఎందుకంటే గుజరాత్ ప్రజలకు అంతగా తెలియని ఆప్ పార్టీ ఈ ఎన్నికల్లో 5కి పైగా సీట్లు సాధించిందంటే అది మంచి పరిణామమే అంటున్నారు. అంతేకాదు ఆపార్టీ ఓటింగ్ శాతం కూడా ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. 2027ఎన్నికల్లో తప్పకుండా ఆప్ గుజరాత్ రాజకీయాల్లో కీలకమైన పార్టీగా ఎదగడం ఖాయమంటున్నారు.
గుజరాత్ లో కాంగ్రెస్ ప్రక్షాళన తప్పనిసరా? - హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కు బూస్టింగే.
ఇప్పటికైనా కాంగ్రెస్ తిరిగి పూర్వవైభవం పొందాలంటే పార్టీలో ప్రక్షాళన తప్పనిసరి చేయాలి. అలాగే బీజేపీ కూడా మోదీ బ్రాండ్ తో కాకుండా ఎన్నికలకు వెళ్లగలిగే పరిస్థితిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. వ్యక్తులు కాదని పార్టీ ముఖ్యమన్న విషయం బీజేపీ గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో 44 సీట్లు అందుకొని బలమైన పార్టీగా పీఠాన్ని అందుకున్న బీజేపీ ఈసారి 20కి పైగా సీట్లకే పరిమితం కావడం ఆలోచించాల్సిన విషయమంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రధాని మోదీ గుజరాత్ వాడు కాబట్టి ఆ నినాదంతో అక్కడ గెలవడం పెద్ద విషయం కాదంటోన్న రాజకీయవిమర్శకులు హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు ఓటమిపాలవడం ఆ పార్టీకి సిగ్గు చేటన్న విషయమేనంటున్నారు. ఒక చిన్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోవడం మోదీ-షాల వైఫల్యానికి నిదర్శనమంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కి అధికారం దక్కటం కాస్తంత ఊరటనిచ్చే విషయమే అయినా ఆపార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. పదవుల కోసం కాసులకు కక్కుర్తి పడితే హిమాచల్ ప్రదేశ్ కూడా బీజేపీ సొంతమవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు. రెండు రాష్ట్రాల్లో ఒకటి కాంగ్రెస్ మరొకటి బీజేపీ అధికారాన్ని అందుకొని సమం చేసినా భవిష్యత్ లో మాత్రం ఈ రెండు జాతీయపార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ వచ్చే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.