Gujarat Election Results 2022:


50 వేల మెజార్టీతో గెలుపు..


గుజరాత్‌లోని విరంగాం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన హార్ధిక్ పటేల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి లఖాభాయ్ భరద్వాజ్‌పై 50 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2015లో రాష్ట్రంలో పాటిదార్ ఉద్యమం జరిగినప్పుడు హార్దిక్ పటేల్ వెలుగులోకి వచ్చారు. యువనేతగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పాటిదార్ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సర్దార్ పటేల్ గ్రూప్ సభ్యుడిగానూ పని చేశారు. నిజానికి...హార్దిక్ పటేల్ మొదట కాంగ్రెస్‌లో చేరారు. అయితే...తనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదని బయటకు వచ్చేసి బీజేపీలో చేరారు. కుల రాజకీయాలకు పెట్టింది పేరు 
విరంగాం నియోజకవర్గం. ఇక్కడ భిన్న వర్గాలకు చెందిన ప్రజలుంటారు. మైనార్టీ జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది. 2012 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుస్తూ వచ్చింది. ఈ సారి మాత్రం ఓటర్లు బీజేపీకే అవకాశమిచ్చారు. ప్రచార సమయంలో హార్దిక్ పటేల్ విరంగాం ప్రజలకు బోలెడన్ని హామీలిచ్చారు. విరంగాంకు జిల్లా హోదా తీసుకురావడం సహా...స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్కూల్స్, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, 1000 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు లాంటి హామీలతో జనాల్ని
ఆకట్టుకున్నారు. 


తిడుతూనే బీజేపీలో చేరి..


2017 గుజరాత్‌ ఎన్నికల నాటికే పాటీదార్ ఉద్యమ నేతగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు పటేల్. ఈ ఉద్యమంతో అప్పట్లో కాంగ్రెస్ బాగానే లాభ పడింది.  కాంగ్రెస్‌కు పరోక్షంగా చాలానే సహకరించారు పటేల్. అప్పుడే కాంగ్రెస్ అధిష్ఠానం పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకు నేందుకు ఆసక్తి చూపించింది. గుజరాత్‌లో అధిక సంఖ్యలో ఉన్న పటేల్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు హార్దిక్ పటేల్‌ని ఓ అస్త్రంగా భావించింది. మొత్తానికి 2019లో కాంగ్రెస్‌లో చేరారు హార్దిక్ పటేల్.  పార్టీలోకి వచ్చీ రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచి హార్దిక్ పటేల్ అధిష్ఠానంపై అసంతృప్తిగానే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరుకే కానీ ముఖ్యమైన సమావేశాలకూ తనకు ఆహ్వానం అందేది కాదని బహిరంగంగానే చాలా సార్లు అసహనంగా మాట్లాడారు పటేల్. ఏదైనా సమస్య గురించి మాట్లాడాలని ప్రెస్‌ కాన్ఫరెన్స్ పెట్టాలని అనుకున్నా పార్టీ అనుమతించలేదని కాస్త ఘాటుగానే విమర్శించారు. ఎప్పుడో అప్పుడు హార్దిక్ కాంగ్రెస్‌ను వీడతారని అనుకుంటున్న తరుణంలోనే ఈ ఏడాది మే 18న కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. పాటీదార్ ఉద్యమం నుంచి కాంగ్రెస్‌లో చేరేంత వరకూ భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు పటేల్. హోం మంత్రి అమిత్‌షాని జనరల్ డయ్యర్‌తో పోల్చుతూ అప్పట్లో పటేల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. భాజపా తనకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఆరోపణలు కూడా చేశారు. ఆ తరవాత అదే బీజేపీలో చేరడమే కాదు. ఇప్పుడు ఆ టికెట్‌తోనే గెలిచారు కూడా. 


Also Read: Gujarat Results 2022: ఆమ్‌ఆద్మీకి భారీ షాక్- 19 వేల ఓట్ల తేడాతో సీఎం అభ్యర్థి ఓటమి