Komatireddy Comments ;  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో లేనని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తిరుమలలో దైవదర్శనం చేసుకున్న తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానన్నారు. వచ్చే ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. షర్మిల ఘటన దురదృష్టకరమని.. అందరూ దీనిని ఖండించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.


కాంగ్రెస్‌కు దూరమే సంకేతాలు ఇచ్చిన కోమటిరెడ్డి 


కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి పలు రకాల కామెంట్లు చేశారు. ఈ కారణంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. అవి తన మాటలు కాదని.. తన మాటల్ని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ వివరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 


రెండు షోకాజ్ నోటీసులకు సమాధానమిచ్చిన కోమటిరెడ్డి.... ఇంకా నిర్ణయం  తీసుకోని హైకమాండ్ 


మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనలేదు. రాహుల్ పాదయాత్ర తెలంగాణకు వచ్చిన  సమయంలో ... కోమటిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కానీ.. ఆయన పాల్గొనే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి మాత్రం తరచూ వ్యక్తం చేస్తున్నారు. 


పీసీసీ చీఫ్ పదవి రానప్పటి నుండి అసంతృప్తి


కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవిని కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అప్పటి నుండి కోమటిరెడ్డి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. మధ్యలో ఆయన రేవంత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చింది. కొద్ది రోజులుగా బాగానే ఉన్నా..తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ.. రాజకీయం వేడెక్కించారు. ఈ సందర్భంలోనే ఆయన సోదరుడు.. బీజేపీలో చేరడం.. కాంగ్రెస్ తరపున మునుగోడులో ప్రచారానికి వెనుకంజ వేయడంతో కాంగ్రెస్ పార్టీతో దూరం పెరిగింది. 


ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !