Dharmaj Crop Guard IPO Listing: ధర్మజ్ క్రాప్ గార్డ్ IPO ఇవాళ (గురువారం 08, 2222) స్టాక్ మార్కెట్లలో లిస్ట్‌ అయింది. IPO ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో ఈ స్టాక్ అరంగేట్రం చేసింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSEలో రూ. 270 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో రూ. 266 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఈ కంపెనీ IPO ఇష్యూ ప్రైస్‌ రూ. 237.


మంచి లిస్టింగ్ తర్వాత, ధర్మజ్ క్రాప్ గార్డ్ షేర్ల మీద మంచి సెంటిమెంట్‌ కనిపించింది. కొనుగోళ్లు పెరిగాయి. దీంతో, ఒక్కో షేరు దాదాపు 19 శాతం లాభంతో రూ. 279 వరకు వెళ్లింది. ఉదయం 10.55 గంటల సమయానికి రూ. 272.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


IPOకి అద్భుత స్పందన
2022 నవంబర్ 28- 30 తేదీల మధ్య జరిగిన IPOలో రూ. 216- 237 ప్రైస్‌ రేంజ్‌లో ఈ కంపెనీ షేర్లను అమ్మి ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ. 251 కోట్లు సేకరించింది.


ధర్మజ్ క్రాప్ గార్డ్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ IPO మొత్తం 35.49 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేసిన కోటా 48.21 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల పోర్షన్‌ 52.29 రెట్లు,  రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 21.53 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ కంపెనీ తన ఉద్యోగుల కోసం కూడా షేర్లను రిజర్వ్ చేసింది. ఉద్యోగుల కేటగిరీ 7.48 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. 


ఈ IPOలో మొత్తం 80,12,990 షేర్లను అమ్మకానికి పెట్టగా, 28,43,58,360 షేర్ల కోసం బిడ్స్‌ వచ్చాయి. రూ. 251 కోట్ల IPOలో ఫ్రెష్‌ ఇష్యూ రూపంలో రూ. 216 కోట్లను సమీకరించగా, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ప్రమోటర్లు రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.


2015లో ధర్మజ్ క్రాప్ గార్డ్ కంపెనీని స్థాపించారు. వ్యవసాయ పంటల కోసం పురుగు మందులు, యాంటీ బయాటిక్స్‌, మైక్రో ఫెర్టిలైజర్స్‌ తయారు చేసి, విక్రయించే వ్యవసాయ రసాయన సంస్థ ఇది.






Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.