Gujarat Results 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆమ్ ఆద్మీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రస్తుతం కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. మరోవైపు పార్టీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గద్వి కూడా ఓటమి పాలయ్యారు.
ఖాంభలియా స్థానం నుంచి పోటీ చేసి సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ పరాజయాన్ని చవి చూశారు. భాజపా అభ్యర్థి అయ్యర్ ములుభాయ్ హర్ధస్‌భాయ్ బేరా చేతిలో ఆయన ఓటమి చెందారు. మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అర్జన్‌భాయ్ ఉన్నారు.
జర్నలిస్ట్
ప్రస్తుతం AAP నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఇసుదాన్ గద్వీ.. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పని చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన గద్వీ జామ్ ఖంభాలియాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కామర్స్‌లో పట్టభద్రుడయ్యాక, 2005లో గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం చదివారు.
ఆ తర్వాత దూరదర్శన్‌లో చేరి అక్కడ ఓ షో చేశారు. తర్వాత పోర్‌బందర్‌లోని 'ఈటీవీ గుజరాతీ' ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. 2015లో ఈశుదాన్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ గుజరాతీ ఛానెల్‌కు ఎడిటర్ అయ్యారు. 'మహామంథన్' పేరుతో ఓ షోను ప్రారంభించిన గద్వీ.. అందులో యాంకర్‌గా వ్యవహరించారు. ఈ షోతో ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది.