Gujarat News: మోర్బీలో పెను విషాదం వెలుగు చూసింది. మోర్బిలో మచ్చు నదిపై నిర్మించిన వేలాడే వంతెన కూలిపోవడంతో వందల మంది నదిలో అమాంతం పడిపోయారు. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మరణించారని స్థానిక బీజేపీ నేత కాంతి అమృతయ్య తెలిపారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం సమయంలో 300 నుంచి 400 వరకూ సందర్శకులు వంతెనపై ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడంతో వందలాది మంది నదిలో మునిగిపోయారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వైర్లకు వేలాడారు. 60 మందికి పైగా చనిపోయిన విషయాన్ని బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ కుండరీయ కూడా ప్రకటించారు.


ఈ దుర్ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పారు. దాదాపు 100 మంది నదిలో గల్లంతైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అంబులెన్స్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. 


పాత వీడియోలు వైరల్


నదిపై వంతెన కుప్పకూలడంతో దానిపై భారీగా జనం ఉన్న పాత వీడియోలు ట్విటర్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొంత మంది యువత ఎగిరి గెంతుతుండడం కనిపిస్తోంది. అందరూ మూకుమ్మడిగా వేలాడే వంతెనపై గంతులు వేస్తుండడంతో తీగల వంతెన భారీగా ఊగుతోంది. కొందరు ఆ వీడియోలను పోస్ట్ చేసి, ఉద్దేశపూర్వకంగానే వంతెనను దెబ్బతినేలా చేశారని విమర్శలు చేశారు. 










తాము రెస్క్యూ పనులు దగ్గరుండి చూసుకుంటున్నామని గుజరాత్ మంత్రి ABP News తో అన్నారు. ఈ ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ట్వీటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. "మోర్బిలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంతో నాకు చాలా బాధ కలిగింది. ప్రభుత్వం నుంచి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి తక్షణ చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. ఈ విషయంలో నేను అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నాను.’’ అని ట్వీట్ చేశారు.


గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్


మోర్బీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తక్షణమే బృందాలను సమీకరించాలని ఆయన ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా, నిరంతరం పర్యవేక్షించాలని.. బాధిత ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రధాని కోరారు. దీనితో పాటు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రధాన మంత్రి సహాయ నిధి (PMNRF) నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.


కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ కూడా మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనపై ట్వీటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. మోర్బీలో ఒక సస్పెన్షన్ వంతెన కూలిపోయిందన్న వార్త విని షాక్ అయ్యానని అన్నారు. ‘‘ఈ ఘటనలో 400 మందికి పైగా బాధితులు ఉన్నారు. మోర్బి చుట్టుపక్కల ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ త్వరగా సహాయ చర్యల్లో పాల్గొని ప్రజలకు సహాయం చేయాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని జగదీష్ ఠాకూర్ ట్వీట్ చేశారు.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్ నుండి చాలా విచారకరమైన వార్త వచ్చింది. మోర్బిలో వంతెన కూలిపోవడంతో చాలా మంది నదిలో పడిపోయినట్లు సమాచారం. వారి జీవితం, ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.