Centre on Covid19: "కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో" అంటూ వచ్చే కరోనా అనౌన్స్ మెంట్ కు ఇక బ్రేక్ పడనుంది.  కరోనా మహమ్మారి ప్రారంభంలో టెలికాం ఆపరేటర్లు సెట్ చేసిన కోవిడ్-19 ప్రీ-కాల్ కాలర్ ట్యూన్ ను త్వరలో తొలగించనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు వ్యాధి గురించి అవగాహన కల్పించాయని ఇకపై ఈ కాలర్ ట్యూన్ అవసరం లేదని చాలా మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర సమయాల్లో కాల్‌లను ఈ కాలర్ ట్యూన్ ఆలస్యం చేస్తున్నాయని భావిస్తున్నారు. ఈ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రీ-కాల్ సందేశాల తొలగించేందుకు పరిశీలిస్తుంది.  ఈ ప్రీ-కాల్ అనౌన్స్‌మెంట్‌లు, కాలర్ ట్యూన్‌లను నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COA), మొబైల్ ఫోన్ వినియోగదారుల అభ్యర్థనలను ఈ లేఖలో ఉదహరించింది. 






కరోనాపై అవగాహన కాలర్ ట్యూన్లు 


"కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇతర చర్యలు కొనసాగుతున్నాయని, కరోనా వ్యాప్తి అదుపులో ఉండడంతో ఈ ఆడియో క్లిప్‌లను తొలగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది" అని ఓ అధికారి తెలిపారు. కోవిడ్-19 ప్రీ-కాల్ అనౌన్స్‌మెంట్‌లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లకు కాలర్ ట్యూన్‌లకు సంబంధించిన సూచనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను టెలికమ్యూనికేషన్ శాఖ అమలు చేస్తుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) పౌరులకు అవగాహన కల్పించడానికి కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, టీకాల గురించి తెలియజేయడానికి కరోనా వైరస్ సంబంధించిన ప్రీ-కాల్ అనౌన్స్‌మెంట్‌లు, కాలర్ ట్యూన్‌లను ప్లే చేస్తున్నారు.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ 


"ఈ ప్రకటనలు పౌరులలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించాయి. నెట్‌వర్క్‌లలో ప్లే అయ్యే వాయిస్ సందేశాలు అత్యవసర సమయాల్లో కాల్‌లను ఆలస్యం చేయడంతో పాటు, బ్యాండ్‌విడ్త్ వనరుల వినియోగంలో ఇబ్బందులు ఏర్పాటుతున్నాయి. ఇది నెట్‌వర్క్‌ను ఓవర్‌లోడ్ చేస్తుంది. కాల్ కనెక్షన్‌లో జాప్యాన్ని సృష్టిస్తుంది" అని DoT తెలిపింది. వినియోగదారుల అభ్యర్థుల సూచనలను ఉటంకిస్తూ ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఇది కస్టమర్ అనుభవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కస్టమర్‌లు అత్యవసర కాల్‌లు చేయవలసి వచ్చినప్పుడు చాలా మంది వీటిని డియాక్టివేట్ చేయడానికి TSPలను సంప్రదించారు. RTI ద్వారా అనేక ఫిర్యాదులను జోడించి రింగ్ బ్యాక్ టోన్ తొలగించాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది.