Fake Websites: సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది. నకిలీలు పెరిగిపోయాయి. అమాయకులను మోసం చేయడానికి రోజుకో రకంగా నేరగాళ్లు స్కెచ్‌లు వేస్తున్నారు. ఏకంగా ఇండియన్ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు్ సేవలు ఉపయోగించుకునే వారికి భారత ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది. పాస్‌పోర్ట్ సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల గురించి ప్రకటన చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in అని తెలిపింది. ఇప్పటికి చాలా మంది పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఇతర మోసపూరిత వెబ్‌సైట్లు, యాప్‌ల కోసం పడిపోతూనే ఉన్నారని అన్నారు. 


ఈ నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు అన్ని అసలైన వెబ్‌సైట్ మాదిరి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను పూరించడం, అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, ఇతర సేవలను అందిస్తున్నట్లు నమ్మిస్తాయి. అలాగే ఈ మోసపూరిత వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు దరఖాస్తుదారుల నుంయి డేటాను సేకరిస్తున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడానికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.


పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మోసపూరిత వెబ్‌సైట్‌లను సందర్శించవద్దని లేదా పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన చెల్లింపులు చేయవద్దని అధికారిక వెబ్‌సైట్‌ www.passportindia.gov.inలో హెచ్చరిక నోట్‌‌లో పేర్కొంది. పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడాని ప్రత్యేకమైన యాప్, వెబ్‌సైట్ లేదని తెలిపింది. 


అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in
అధికారికంగా పాస్‌పోర్ట్ సేవలు www.passportindia.gov.inలో మాత్రమే పొందవచ్చని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశం అంతటా ఉన్న దరఖాస్తుదారులకు, పాస్‌పోర్ట్ సంబంధిత అవసరాలన్నింటినీ ఇది ఏకైక అధీకృత పోర్టల్ అని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 36 పాస్‌పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. విదేశాల్లోని 190 భారతీయ మిషన్లు, పోస్ట్‌ల ద్వారా భారతీయ పౌరులకు పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. 


నకిలీ వెబ్‌సైట్లు ఇవే
www.indiapassport.org
www.online-passportindia.com
www.passportindiaportal.in
www.passport-india.in
www.applypassport.org


పైన పేర్కొన్న నకిలీ వెబ్‌సైట్లు ప్రధానంగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులను మోసం చేస్తున్నాయని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వెబ్‌సైట్లను ఓపెన్ చేసినప్పుడు పలు రకాల సేవలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. దరఖాస్తు దారుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు ఫారం, అప్లికేషన్ స్టేటస్, ట్రాకింగ్ వంటి సేవలను అందిస్తున్నట్లు నమ్మిస్తున్నాయని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


వీటిలో కొన్ని డొమైన్లు, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నారు. అయితే కాలం మారుతున్న నేపథ్యంలో కొత్త వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని పోలిన, సారూప్య డొమైన్‌లతో మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.inలో మాత్రమే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇతర వెబ్‌సైట్లను నమ్మొద్దని సూచించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial