దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో వేడుకలకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దక్షిణ గోవాలోని ఓ దీవిలో ఇండియన్ నేవీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి, స్థానికులు దీనిపై రాద్దాంతం చేశారు. చివరగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రంగంలోకి దిగారు. ఇలాంటి పనులను అడ్డుకుంటే ఉక్కు పాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. దక్షిణ గోవాలోని సావో జాసింటో దీపంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలని నేవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వాస్కో టౌన్ సమీపంలో జెండా పండుగకు నేవీ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. కొందరు స్థానికులు ఈ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేయవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో నేవీ అధికారులు త్రివర్ణ పతకాన్ని ఎగురవేసే కార్యక్రమాన్ని రద్దు చేయాలని భావించారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ఐఎన్ఎస్ హన్సా అధికార ప్రతినిధి శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.
Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
త్రివర్ణ పతాకం ఎగురవేయడాన్ని కొందరు వ్యక్తులు వ్యతిరేకించడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా.. దేశంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేయవద్దని జాతి విద్రోహ చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. జాతీయ జెండాను నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎగురవేయాలని నేవీ అధికారులకు సూచించారు. ఎవరైనా ఇలాంటి పనులకు అడ్డుపడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. జాతీయ జెండాను అవమానించేలా చర్యలకు దిగడం నిజంగా సిగ్గుచేటు, ఇది ఒక హేయమైన చర్య అని పేర్కొన్నారు.
Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!
ఇండియన్ నేవీ తాము నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే జాతీయ పతకాన్ని ఎగురవేయాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ సోషల్ మీడియా ద్వారా కోరారు. గోవా పోలీసులు మీకు సహకరిస్తారని, జాతి విద్రోహ చర్యలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Also Read: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు