GOA Fish Curry Rice: గోవా బీచ్‌లలోని హోటళ్లలో అక్కడి ప్రధాన వంటకం అయిన ‘ఫిష్ కర్రీ-రైస్’ని తప్పనిసరిగా అందించవలసి ఉంటుందని పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే ఆదివారం తెలిపారు. గోవా వంటకాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇతర భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో పాటు గోవా వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొత్త షాక్ పాలసీలో భాగంగా మెనులో కొబ్బరి ఆధారిత తయారీని తప్పనిసరిగా చేర్చాలని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు తీరం వెంబడి ఉన్న షాక్స్‌లు (బార్ అండ్ రెస్టారెంట్ తరహా దుకాణాలు) ఉత్తర భారతానికి చెందిన ఆహారాన్ని అందిస్తున్నాయని, గోవా వంటకాలు ఈ ప్రదేశాల్లో అందుబాటులో లేవని ఆయన చెప్పారు. 


చేపల కూర, అన్నంతో సహా గోవా ఆహారాన్ని తప్పనిసరి అని మంత్రి తెలిపారు. గోవాకు చెందిన గొప్ప వంటకాలను పర్యాటకులకు అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇటీవల క్యాబినెట్ షాక్ పాలసీని ఆమోదించిందని, బీచ్‌లలో అక్రమ హాకింగ్, విక్రయాలను పరిష్కరించే ఉద్దేశ్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. బీచ్‌లలో అక్రమ వ్యాపారాలు, వ్యాపారాలు చేస్తున్న చాలా మంది మహిళలు పర్యాటక శాఖ అధికారులకు పట్టుబడినప్పుడు షాక్స్‌లో పనిచేస్తున్నట్లు నటిస్తారని ఆయన అన్నారు. కొత్త విధానం మేరకు ప్రతి షాక్ దానిలో పని చేస్తున్న సిబ్బంది జాబితాను విభాగానికి సమర్పించవలసి ఉంటుందన్నారు. ఫలితంగా బీచ్‌లలో అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


షాక్ ఆపరేటర్లకు పర్యాటక శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే అన్నారు. పర్యాటకానికి ఆటంకం కలగకుండా షాక్ ఆపరేటర్లు చూసుకోవాలని ఖౌంటే చెప్పారు. గోవా ప్రభుత్వం విజన్ తో పని చేస్తోందని, అయితే అది ఒక్కరోజులో జరగదని ఆయన అన్నారు. ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై కల్పనపై ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గోవాలో  పర్యాటక పరిశ్రమకు మద్దతుగా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గోవాలోని హోటళ్లలో సగటున 80 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు మంత్రి తెలిపారు. హోటళ్ల యజమానులు ఆక్యుపెన్సీపై సంతోషంగా ఉన్నారని అన్నారు. కానీ ఆక్యుపెన్సీ తగ్గితే, హోటల్ యజమానులు ప్రభుత్వాన్ని నిందిస్తారని ఖౌంటే అన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రం ముందడుగు వేస్తోందని, ఇందు కోసం పర్యాటక శాఖ, ఇతర విభాగాలతో కలిసి పని చేస్తుందన్నారు.


అడుగడుగునా అందాలే
గోవాలో (Goa) చూడటానికి, ఆస్వాదించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చారిత్రక కట్టడాల నుంచి అద్భుతమైన కోటల వరకు, చూడచక్కని చర్చీల నుంచి అందమైన బీచ్‌లు వరకు ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుంది. దేశంలోనే టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ కావడంతో దేశీయ పర్యాటకులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే టూరిస్టులకు సైతం మంచి ఫేవరెట్ హాలిడే స్పాట్గా పేరుగాంచింది. దీంతో ఇక్కడికి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తూనే ఉంటారు. దీంతో అక్కడికి పర్యాటకులు ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనుకుంటారు. 


సరికొత్త రుచులు ఆస్వాదించేవారికి గోవా పర్యాటకం కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుంది. సముద్రపు చేపలతో తయారు చేసిన కూరలు ఇక్కడ ప్రత్యేకం. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలతో తయారు చేసే రుచికరమైన వంటకాల ఘుమఘుమలు నోరూరిస్తాయి. ముఖ్యంగా జీడిమామిడి, కొబ్బరి కల్లు నుంచి తయారు చేసిన ‘ఫెన్నీ’ అనే పానీయం ఇక్కడి ప్రత్యేకత. భోజనం తర్వాత తీసుకునే డెజర్ట్‌లలో ‘బెబింకా’ గోవా సంప్రదాయ వంటకం ప్రధానమైననది. మైదా, చక్కెర, నెయ్యి, కోడిగుడ్డు సొన, కొబ్బరిపాలతో బెబింకాను తయారు చేస్తారు. ఇది పది రోజుల వరకూ తాజాగా ఉంటుందట!