Gangsters Love Marriage: గ్యాంగ్‌స్టర్ కాలా జథేడీ అలియాస్ సందీప్.. మరో గ్యాంగ్‌స్టర్ అనురాధా చౌదరి నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. మార్చి 12న సోనిపత్‌లో పెళ్లిచేసుకోబోతున్నారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ కలా జథేడీ పెరోల్ కోసం అర్జీ పెట్టుకున్నారు. కోర్టు కూడా మానవతా ధృక్పథంతో పెరోల్‌కు అంగీకరించింది. ఆరు గంటల పాటు పెరోల్ మంజూరు చేసింది. పెరోల్‌పై బయటకు వచ్చి ప్రేయసిలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ద్వారకా సెక్టార్-3లో పెళ్లి చేసుకోబోతున్నాడు.
కాలా జథేడీ ఎవరు..?
సందీప్ అలియాస్ కాలా జథేడీ పెద్ద గ్యాంగ్‌స్టర్. లారెన్స్ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇతనిపై ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో హత్య, దోపిడీతోపాటు పలు తీవ్రమైన నేరాలకు సంబంధించి కనీసం 40 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మల్లయోధుడు సాగర్ ధనఖడ్ హత్యతో గ్యాంగ్‌స్టర్‌గా కళా జాతేడి పేరు వెలుగులోకి వచ్చింది. మరో రెజ్లర్ సుశీల్ కుమార్‌ను కూడా కాలా జాతేడి బెదిరించాడు. జైల్లో ఉన్న జథేడీకి లారెన్స్ బిష్ణోయ్ అన్ని రకాల సహాయాన్ని అందించాడు.
అనూరాధా చౌదరి కథేంటి..?
అనురాధ చౌదరి అలియాస్ మేడమ్ మింజ్. ఆమెను తూటల రాణి అని కూడా పిలుస్తారు. ఆమెది రాజస్థాన్‌లోని సికార్ జిల్లా అల్ఫాసర్ గ్రామం. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో భాగస్వామి కోటి రూపాయల మేర మోసచేయడంతో అప్పుల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత క్రైమ్‌లోకి వచ్చింది. అనూరాధా చౌదరి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పొందింది. గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ దగ్గర పనిచేసింది. 2017లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ మృతి చెందాడు. మనీ లాండరింగ్, కిడ్నాప్, బెదిరింపులు వంటి పలు కేసుల్ని ఎదుర్కొంటోంది.
కాలా జథేడీ-అనూరాధా చౌదరి పరిచయం..
కాలా జథేడి, అనూరాధా చౌదరి ఇద్దరూ గ్యాంగ్‌స్టర్లు. కామన్ స్నేహితుడి ద్వారా వారికి పరిచయం ఏర్పడింది. అనురాధా-సందీప్ మధ్య తొలిచూపులోనే ప్రేమ మొదలైంది. 2020 వసంతకాలంలో కరోనా మహమ్మారి సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. సందీప్ తలపై 7లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. 2020 నుంచి పోలీసుల్ని తప్పించుకొని పలు రాష్ట్రాలకు మకాం మార్చారు. చివరకు 2021 జులైలో పోలీసులకు చిక్కారు. జూలై 2021లో కాలా జాతేడి, అనూరాధా చౌదరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జాథేడీ తీహార్ జైలులో ఉండగా... మేడమ్ మింజ్‌కు బెయిల్ వచ్చింది. అయినా... ఆమె జైలుకు వెళ్లి జథేడీని తరచూ కలుస్తూనే ఉంది. బెయిల్‌పై వచ్చిన్పపటి నుంచి.. వృద్ధులైన జథేడీ తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ ఉంది.
గ్యాంగ్ స్టర్ల పెళ్లి ఎప్పుడు? ఎక్కడ..?
ఈ గ్యాంగ్‌స్టర్ జంట మార్చి 12న ద్వారకలో వివాహం చేసుకోనుంది. మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వివాహ వేడుక జరగనుంది. మరుసటి రోజు మార్చి 13న ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు గృహ ప్రవేశ వేడుక కోసం పెరోల్ మంజూరు చేశారు. అయితే.. జథేడీ కస్టడీ నుండి పారిపోకుండా.. అతని కదలికలపై నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది.