Telugu News: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి జి.పరమేశ్వరను చంపుతామంటూ దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాంబు బ్లాస్ట్ చేస్తామని బెదిరింపులు ఈ మెయిల్స్ ద్వారా వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ఆరోపణలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తనకు ఎలాంటి బెదిరింపు ఈ మెయిల్స్ రాలేదని బుధవారం (మార్చి 6) విలేకరులకు స్పష్టం చేశారు.


shahidkhan10786@protonmail.com అనే ఈ మెయిల్ నుంచి షాహిద్ ఖాన్ అనే వ్యక్తి బెంగళూరులోని టెక్ సిటీ ప్రాంతంలో బాంబు పేలుస్తానంటూ ఓ బెదిరింపు మెయిల్స్ పంపినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి బెదిరింపు మెయిల్స్ కానీ, కాల్స్ గానీ రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. 


కర్నాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు మార్చి 2న ఈ బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని పోలీసులు వెల్లడించారు. మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరిస్తూ దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు సోమవారం షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. తాము పేర్కొన్న బాంబు పేలుళ్లు జరగకూడదంటే 2.5 మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఈ మెయిల్ లో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే తమ డిమాండ్లను సోషల్ మీడియాలో పెడతామని, తర్వాత దాడికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేస్తామని ఈమెయిల్ లో రాశారు. షాపింగ్ మాల్స్ సహా అంబారీ ఉత్సవ్ బస్సుల్లోనూ బాంబు బ్లాస్ట్ లకు ప్లాన్ చేశామని నిందితులు ఈ మెయిల్ లో పేర్కొన్నారు.
ఈ బెదిరింపు మెయిల్ బూటకమని అనిపిస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో నిఘాను పెంచామని పోలీసులు స్పష్టం చేశారు. 


అయితే, మార్చి 1న బెంగళూరు వైట్ ఫీల్డ్స్ లోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును రాష్ట్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది.