G20 Summit 2023:


రెండ్రోజుల సదస్సు..


సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీ వేదికగా G20 సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల సెక్యూరిటీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. సమావేశాలు జరిగే వేదిక సమీపంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు (సెప్టెంబర్ 8) ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 7) రాత్రి 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు నిఘా నీడలోనే ఉండనుంది ఢిల్లీ. గూడ్స్ వెహికిల్స్‌ తిరగకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. ట్యాక్సీలు, ఆటోలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఓ గెజిట్ విడుదల చేసింది. మొత్తం నగరాన్ని "Controlled Zone" గా ప్రకటించింది. కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినివ్వనుంది ప్రభుత్వం. హౌజ్‌ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్స్‌కి సంబంధించిన వెహికిల్స్‌కి ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్‌తో పాటు, మార్కెట్‌లను పూర్తి స్థాయిలో రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ కంట్రోల్డ్‌ జోన్‌లోకి ఫ్లిప్‌కార్ట్,అమెజాన్‌తో పాటు స్విగ్గీ, జొమాటోలకూ అనుమతి లేదు. మెక్సికన్, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఢిల్లీకి రానున్నారు. అయితే...ఎక్కువ మంది అధినేతలు, ప్రతినిధులు మాత్రం రేపు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు.


రిజర్వ్ ఎయిర్‌పోర్ట్‌లు..


అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో రేపు (సెప్టెంబర్ 8) ఢిల్లీకి రానున్నారు. వీళ్లను ఆహ్వానించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. వీవీఐపీల విమానాలు ల్యాండ్ అయ్యేందుకు పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు చేశారు. దాదాపు 70 మంది VVIPలు ఇక్కడే ల్యాండ్ అవనున్నారు. ఇక ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే అమృత్‌ సర్‌, ఇండోర్, జైపూర్, లఖ్‌నవూల్లో రిజర్వ్ ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇక మరో కీలక విషయం ఏంటంటే...ఈ సమ్మిట్‌లో డిజిటల్ ఇండియా నినాదాన్ని గట్టిగానే వినిపించనుంది భారత ప్రభుత్వం. Ask Geetha అనే స్పెషల్ యాప్‌ని లాంఛ్ చేసింది. లైఫ్ స్కిల్స్‌కి సంబంధించిన ప్రశ్నలకు ఈ యాప్ సమాధానం చెప్పనుంది. అతిథులకు ప్రత్యేక శాకాహార వంటలు తయారు చేయనున్నారు. బంగారం, వెండి పాత్రల్లో అతిథులకు వడ్డించనున్నారు. వెండి గ్లాస్‌లపై జాతీయ పక్షి అయిన నెమలిని చెక్కించారు. వీటితోనే డ్రింక్స్ అందించనున్నారు.  


జీ-20 సదస్సుకు హాజరు కాబోతున్న వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతల సతీమణులకు ప్రత్యేక విందు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని జైపుర్‌ హౌస్‌లో స్పెషల్‌గా మధ్యాహ్న విందు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెనూలో చిరు ధాన్యాల ఆహార పదార్థాలను కూడా చేర్చారు. నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ)కు కేంద్రమైన జైపుర్‌ హౌస్‌లో ప్రత్యేక పెయింటింగ్స్‌, పేరొందిన శిల్పాలు, అద్భుతమైన ఫొటోలతో పాటు అనేక రకాల కళాకృతులు ఉన్నాయి. 


Also Read: అప్పటి వరకూ రిజర్వేషన్‌లు ఉండాల్సిందే, అది వాళ్లకిచ్చే గౌరవం - RSS చీఫ్ మోహన్ భగవత్