RSS Chief Mohan Bhagwat:



రిజర్వేషన్‌లపై వ్యాఖ్యలు..


రిజర్వేషన్‌లపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మన సమాజంలో అసమానతలు ఉన్నాయని, ఇవి ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...అఖండ భారతం గురించి ప్రస్తుత తరం కచ్చితంగా ఆలోచిస్తుందని వెల్లడించారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని..తప్పు చేశామని తెలుసుకున్నారని పరోక్షంగా పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మరాఠీ రిజర్వేషన్‌లపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. 


"మనంతట మనమే కొందరిని వేరు చేసి సమాజం నుంచి వెనక్కి నెట్టేశాం. దూరం పెట్టాం. వాళ్లను కనీసం పట్టించుకోలేదు. దాదాపు 2వేల ఏళ్ల పాటు ఇదే జరిగింది. వాళ్లకు సమాన హక్కులు ఇవ్వనంత వరకూ ఇలాంటి ప్రత్యేక హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌లు అలాంటి వాటిలో ఒకటి. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందే. రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్‌లకు RSS ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. మనకు కనిపించకపోయినా వివక్ష అనేది మన సమాజంలో ఇప్పటికీ ఉంది. ఇలాంటి వాళ్లకు రిజర్వేషన్‌ల ద్వారానే గౌరవమివ్వాలి."


- మోహన్ భగవత్, RSS చీఫ్ 


అఖండ భారత్..


2 వేల ఏళ్ల పాటు వివక్ష ఎదుర్కొన్న వాళ్ల కోసం రిజర్వేషన్‌ల విషయంలో ఆ మాత్రం భరించలేమా అని ప్రశ్నించారు మోహన్ భగవత్. అఖండ భారత్‌ గురించి ఓ విద్యార్థి ప్రశ్నించగా...అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేమని వెల్లడించారు. 


"కాలం గడించే కొద్దీ అఖండ భారత్ మళ్లీ వచ్చే అవకాశాలుండొచ్చు. ఎందుకంటే...భారత్‌కి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన నుంచి విడిపోయిన వాళ్లు ఇప్పుడు బాధ పడుతున్నారు. మళ్లీ భారత్‌లో కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ్యాప్‌లో ఉన్న సరిహద్దుల్ని చెరిపేసి కలిసిపోదామని కోరుకుంటున్నారు"


- మోహన్ భగవత్, RSS చీఫ్ 


జాతీయ జెండా ఎగరేస్తాం..


RSS కార్యాలయంలో జాతీయ జెండా ఎందుకు ఎగరేయడం లేదని కొందరు ప్రశ్నించారు. దీనికీ బదులు చెప్పారు భగవత్. అలాంటిదేమీ లేదని, ఆగస్టు 15తోపాటు జనవరి 26న ఏటా తాము ఎక్కడున్నా జెండా ఎగరేస్తామని వివరణ ఇచ్చారు. అసలు ఇలాంటి ప్రశ్నలు తమను అడగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. జాతీయ జెండాను గౌరవించే విషయంలో అందరి కన్నా ముందుండేది RSS కార్యకర్తలే అని స్పష్టం చేశారు. 


కులాన్ని నిర్మూలించాలి..


సమాజంలో నుంచి వర్ణం, జాతి అనే కాన్సెప్ట్‌లను నిర్మూలించాలని అన్నారు RSS చీఫ్ మోహన్ భగవత్. గతేడాది అక్టోబర్‌లో నాగ్‌పూర్‌లో ఓ బుక్‌ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న భగవత్...ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజానికి కులవ్యవస్థతో పని లేదని తేల్చిచెప్పారు. "వజ్రసుచి టంక్" అనే పుస్తకం గురించి మాట్లాడుతూ....సమానత్వం అనేది భారత సంస్కృతిలో భాగమని, కానీ...దాన్ని మర్చిపోయామని అన్నారు. ఈ కారణంగానే కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. "వర్ణం, జాతి" అనే వ్యవస్థల ఉద్దేశం వివక్ష కాదని, సదుద్దేశంతోనే వాటిని ప్రవేశపెట్టారన్న చర్చపైనా ఆయన స్పందించారు. "ఇలాంటి ప్రశ్నలెవరైనా నన్ను అడిగితే...అదంతా గతం. దాన్ని మర్చిపోయాం ముందుకెళ్లిపోదామని బదులిస్తాను" అని వెల్లడించారు భగవత్. "సమాజంలో వివక్షకు కారణమయ్యేది ఏదైనా మనం వాటిని వదిలే యాల్సిందే" అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన ముందు తరాలు చాలా తప్పులు చేశాయనీ, అందుకు భారత్‌ కూడా అతీతమేమీ కాదని అన్నారు. ఇది తప్పకుండా మనమంతా ఒప్పుకోవాలని చెప్పారు.


Also Read: భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కో ఆర్డినేటర్ శ్రింగ్లా