G20 Summit 2023:
జైరాం రమేశ్ ట్వీట్..
G20 సదస్సుకి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చారు. ఆయన ఇండియాకి రావడం ఇదే తొలిసారి. ఇటీవలే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో మోదీకి ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది అమెరికా. బైడెన్‌కి కూడా అదే స్థాయిలో ఆతిథ్యం ఇస్తోంది భారత్. అయితే...ప్రధానితో భేటీ ముగిసిన తరవాత మీడియా ప్రశ్నలు అడిగే వీల్లేకుండా భారత్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మీడియా రిక్వెస్ట్ చేసినప్పటికీ అందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రశ్నలు అడిగేందుకు మీడియాకి అనుమతివ్వలేదని బైడెన్ టీమ్ చెప్పిందని, ఇదే ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.
"మీడియా రిక్వెస్ట్ చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నలు అడిగేందుకు భారత్ ఒప్పుకోలేదని బైడెన్ టీమ్ చెప్పింది. ద్వైపాక్షిక చర్చలపై ప్రశ్నించేందుకు నిరాకరించింది. సెప్టెంబర్ 11న మాత్రం వియత్నాంలో బైడెన్ మాట్లాడతారు. అక్కడి మీడియాకి అందుకు అనుమతి ఉంది. కానీ మన దగ్గర అందుకు పర్మిషన్ లేదు. ఇది మోదీ మార్క్ ప్రజాస్వామ్యం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
జర్నలిస్ట్‌లకు నో ఎంట్రీ
నిజానికి ద్వైపాక్షిక చర్చల విషయంలో మీడియాకి పూర్తి ఆంక్షలు విధించింది ప్రభుత్వం. జో బైడెన్ ఇండియాకి వచ్చి నేరుగా ప్రధాని మోదీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బైడెన్‌తో పాటు వచ్చిన జర్నలిస్ట్‌లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వాళ్లు భేటీ అయినంత సేపు బయటే వేచి ఉన్నారు. దీనిపై అమెరికా కూడా కాస్త అసహనానికి గురైనట్టు సమాచారం. జో బైడెన్ ఏ సమయానికి ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని, ఈ విషయంలో మీడియాపై ఆంక్షలు లేకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, జో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పాటు డిఫెన్స్‌పైనా చర్చలు జరిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో కేంద్రం పెద్ద తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయానికి అక్కడ అసందర్భమైన పాటను పెట్టి కించపరిచారని మండి పడుతున్నాయి. Ed Sheeran కంపోజ్ చేసి పాడిన Shape of You పాటని ప్లే చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రులు బైడెన్‌ని ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాటలు వినిపించాయి. అదే పాటకు స్టేజ్‌పై డ్యాన్సర్‌లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జో బైడెన్ వచ్చినప్పుడే కాదు. అర్డెంటీనా ప్రెసిడెంట్ అల్బర్టో ఫెర్నాండెజ్ వచ్చినప్పుడూ ఇదే పాట వినిపించింది. అయితే...ఈ పాటని యాజిటీజ్‌గా కాకుండా ఇండియన్ మ్యూజిక్‌తో మిక్స్ చేసిన ఓ రెండిషన్‌ని ప్లే చేశారు. అయినా...అందులో లిరిక్స్ అభ్యంతరకరంగా ఉంటాయని, అలాంటి పాటను దేశాధినేతలు వచ్చినప్పుడు పెట్టడమేంటని కొందరు వాదిస్తున్నారు.
Also Read: G20 Summit 2023: ఢిల్లీ డిక్లరేషన్‌ని ఆమోదించిన G20 నేతలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన