New MSP Plan: పంటలకు కనీస మద్దతు ధర కోసం పంజాబ్‌-హర్యానా సరిహద్దులో చేపట్టిన ‘ ఢిల్లీ చలో’ (Delhi Chalo) మార్చ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైతు నాయకులు (Farmer Leaders) తెలిపారు. కేంద్ర మంత్రుల (Central Ministers)తో ఆదివారం చర్చల అనంతరం రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను ప్రతిపాదించడంతో దానిని అధ్యయనం చేసేందుకు రాబోయే రెండు రోజుల పాటు చలో ఢిల్లీని వాయిదా వేసినట్లు చెప్పారు. రైతు నాయకులందరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.


ముగ్గురు మంత్రులతో చర్చలు
వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా (Arjun Munda), వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ (Piyush Goyal), హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai ) చండీగఢ్‌లో ఆదివారం రైతు నాయకులతో నాల్గో విడత చర్చలు జరిపారు. కనీస మద్దతు ధర, చట్టపరమైన హామీ, రైతు సమస్యల గురించి వారు చర్చించారు. సహా వారి డిమాండ్లపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.


ఇవే ప్రతిపాదనలు
నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీపీఎఫ్ ) నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) వంటి సహకార సంఘాలు కంది పప్పు, మినప పప్పు, ఎర్ర కంది పప్పు, మొక్కజొన్న పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని గోయల్ తెలిపారు. వచ్చే ఐదేళ్లపాటు ఆయా పంటను ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని, దీని కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.  


రెండు రోజుల పాటు నిలిపివేత
ప్రభుత్వ ప్రతిపాదనపై రెండు రోజుల పాటు రైతు సంఘాల నేతలతో కలిసి చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో రైతు ఫోరమ్‌లలో కేంద్రం ప్రతిపాదనపై చర్చించి నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందర్ తెలిపారు. అలాగే రుణమాఫీ, ఇతర డిమాండ్లపై చర్చలు సాగుతున్నాయని, రాబోయే రెండు రోజుల్లో ఇవి పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారమవలేదని, ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11 గంటలకు చలో ఢిల్లీ మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని పందర్ తెలిపారు.


ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనపై సంబంధిత ఫోరమ్‌, రైతు సంఘాల నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని, ఇందుకు రెండు రోజుల సమయం తీసుకుంటున్నట్లు సర్వన్ సింగ్ పందర్ చెప్పారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా ఒక పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, కొన్ని కారణాలతో అది జరగకపోతే.. తమను శాంతియుతంగా ఢిల్లీకి వెళ్లనివ్వాలని కోరాతామని ఆయన చెప్పారు.


ఇప్పటికే మూడు సార్లు చర్చలు
ఇంతకు ముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో కేంద్రమంత్రులు, రైతు నేతలు సమావేశమైనప్పటికీ చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో రైతులు చలో ఢిల్లీ మార్చ్‌ను చేపట్టగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు రైతులు హరియాణా సరిహద్దులోని శంభు, ఖానౌరీ పాయింట్‌లలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఢిల్లీ మార్చ్‌కు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా మద్దతు తెలిపాయి.


కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 బాధితులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే లఖింపూర్ ఖేరీ హింస, భూసేకరణ చట్టం, 2020-21లో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతున్నారు.